Creative Flex in Andhra Village: పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది.. సెటిల్ అవ్వక కొందరు లేట్ చేస్తే.. సరైన సంబంధం దొరకక మరికొందరు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు.. అయితే, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వేసిన ఓ భారీ ఫ్లెక్సీ ఇప్పుడు చర్చకు దారితీసింది.. ఓ వైపు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూనే.. మరో వైపు.. పెళ్లి చేసుకోవడానికి యవతులు కావాలి అంటూ ప్రకటన కూడా వచ్చేలా ఈ ఫ్లెక్సీ రూపొందించారు యువకులు..
Read Also: AR Rahman : రెహమాన్ వర్సెస్ ట్రోలర్స్.. మద్దతుగా నిలిచిన ప్రముఖ రచయిత వరుణ్!
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో పశువుల పండుగ సందర్బంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు గ్రామస్తులతో పాటు పండుగకోసం వచ్చిన సందర్శకులను కూడా ఆశ్చర్యానికి గురిచేశాయి, సాధారణంగా శుభాకాంక్షలు, సంప్రదాయ సందేశాలు, పశువుల పూజ ప్రాముఖ్యత వంటి విషయాలతో బ్యానర్లు ముస్తాబయ్యే ఉత్సవాల్లో, ఈసారి మాత్రం యువకులు వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. పండుగ వాతావరణాన్ని వినోదాత్మకంగా మార్చే ప్రయత్నంలో భాగంగా, యువకులు తమ ఫోటోలను బ్యానర్లపై ముద్రించించి, వాటిపై స్టార్ గుర్తులు ఉంచుతూ “పెళ్లికి యువతులు కావాలి” అనే ప్రత్యేక సందేశాన్ని పొందుపరిచారు.
ఈ అసాధారణమైన ఆలోచన పండుగకు వచ్చిన ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షించింది. బ్యానర్‌ను చూసిన గ్రామస్తులు, సందర్శకులు నవ్వులు చిందిస్తూ, ఈ క్రియేటివ్ ఆలోచనపై ఆసక్తి వ్యక్తం చేశారు. కొందరు యువకుల వినూత్నమైన హాస్యభరితమైన ప్రయత్నం గ్రామంలో సరదా వాతావరణాన్ని తీసుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. గ్రామీణ పండుగలలో ఈ తరహా వినూత్నత అరుదుగా కనిపిస్తుందని, యువత తమ ఆలోచనలకు కొత్తదనం జోడించడం పండుగ జాతరను మరింత ఉత్సాహభరితంగా మార్చిందని పలువురు అభినందించారు. మొత్తంగా ఫ్లెక్సీలో ఎంత మంది ఉన్నా.. అందులో ఫొటో పక్కన స్టార్ ఇచ్చిన యువకులను పెళ్లి చేసుకోవడానికి యువతులు కావాలి అన్న మాట.. ప్రస్తుతం ఈ బ్యానర్లు కలికిరిపల్లెలో హాట్ టాపిక్‌గా మారి, సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి.