ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల సందర్భంగా పార్లమెంటులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చంద్రబాబు కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో అల్లూరిని చేర్చడం సంతోషమని, ఈ విషయంలో తెలుగు ప్రజల తరపున కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చంద్రబాబు చెప్పారు. జూలై 4న భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ ప్రజల మనసుల్లో గుర్తుండిపోతుందని పేర్కొన్నారు.
Read Also: RK Roja: పేదల కోసం పుట్టిన పార్టీ వైసీపీ.. మళ్ళీ మనదే అధికారం
టీడీపీ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం అభ్యర్థన మేరకు అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని పార్లమెంట్ హాలులో ఏర్పాటు చేయాలని 13వ లోక్‌సభలోని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చంద్రబాబు గుర్తుచేశారు. అయితే రాష్ట్రంలో ప్రభుత్వాలు మారడంతో విగ్రహ ప్రతిష్ఠాపనలో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. ఇప్పటికైనా జాప్యం లేకుండా అల్లూరి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరారు. అల్లూరిని సత్కరించుకోవడం అంటే దేశ స్ఫూర్తి, మన గిరిజన జాతులను గౌరవించుకోవడమేనని ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.అల్లూరి సీతారామరాజు స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తికి, త్యాగానికి, ధైర్యసాహసాలకు నిలువుటద్దంగా నిలిచారని కొనియాడారు.