ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్థరాత్రి అరెస్ట్ చేస్తారా..? అంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామవాసి, టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంకటేష్ ఇంట్లోకి చొరబడి దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన.. అర్థరాత్రిళ్ళు గోడలు దూకివెళ్ళడం, గునపాలతో గొళ్ళెం పగలగొట్టి ఇళ్లలోకి చొరబడతారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇంట్లో మనుషుల్ని ఎత్తుకెళ్ళడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి రాష్ట్ర పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు.. వెంకటేష్ అనే సామాన్య కార్యకర్తపై పోలీసులు వ్యవహరించిన తీరు అమానుషంగా ఉందన్నారు. మరో వ్యక్తి సాంబశివరావును పోలీసులు అర్థరాత్రి ఇంటిపై పడి అరెస్టు చేయడమేంటి? అని నిలదీసిన ఆయన.. ప్రభుత్వ అసమర్థపాలనపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తే అరెస్టు చేస్తారా? వాళ్లేమన్నా ఖునీకోరులా? తీవ్రవాదులా? అంటూ ధ్వజమెత్తారు.
Read Also: Pushpa Srivani: పుష్పశ్రీ వాణి ఓపెన్ చాలెంజ్.. రావాడ జంక్షన్‌కు రండి..
ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో ప్రశ్నించడం నేరం కాదన్నారు చంద్రబాబు నాయుడు.. అరెస్టు సమయంలో పోలీసులు లైట్లు పగులగొట్టి చీకట్లో చేసిన విధ్వంసమే నిజమైన నేరంగా పేర్కొన్న ఆయన.. ప్రభుత్వ పెద్దల మన్నన కోసం బరితెగిస్తున్న పోలీసు అధికారులు మూల్యం చెల్లించుకుంటారు అని హెచ్చరించారు.. సీఐడీ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన వెంకటేశ్, సాంబశివరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. కోర్టులు హెచ్చరించినా అతి పోకడలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులు ఖచ్చితంగా తమ చర్యలకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. ఇక, అరెస్ట్ చేసిన వెంకటేష్‌ను సీఐడీ ప్రశ్నిస్తుండగా.. వెంటనే విడుదల చేయాలంటూ ఆందోళనకు దిగాయి టీడీపీ శ్రేణులు.. వారిని పోలీసులు చెదరగొట్టారు.
అర్థరాత్రిళ్ళు గోడలు దూకివెళ్ళడం, గునపాలతో గొళ్ళెం పగలగొట్టి ఇళ్లలోకి చొరబడటం, ఇంట్లోని మనుషుల్ని ఎత్తుకెళ్ళడం వంటి దోపిడీ దొంగల సంస్కృతిలోకి రాష్ట్ర పోలీసులు వెళ్లడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.(1/4) pic.twitter.com/eAynD20HFZ
— N Chandrababu Naidu (@ncbn) June 30, 2022