వరుసగా పెరుగుతూ పెట్రో ధరలు ఆల్‌టైం హై రికార్డులు సృష్టించాయి.. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో.. కేంద్రం కోత విధించింది.. ఇక, కేంద్రం బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు అడుగులు వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను కూడా తగ్గించాయి. దీంతో.. ఇప్పుడు తగ్గించని రాష్ట్రాలపై ఒత్తిడి పెరుగుతోంది.. అందులో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా ఒకటి కాగా.. పెట్రో ధరలపై పోరాటానికి సిద్ధం అవుతోంది తెలుగుదేశం పార్టీ.. ఇవాళ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రం డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించినా.. ఏపీలో తగ్గించడం లేదని విమర్శించారు.. ఏపీలో కంటే చాలా రాష్ట్రాల్లో చమురు ధరలు తక్కువేనని గుర్తుచేసిన ఆయన.. దీనికి జగన్ ఏం సమాధానం చెబుతారు..? అని ప్రశ్నించారు.
ఇక, తాను అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు ఎందుకు తగ్గించడం లేదు..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. మాట మీద నిలబడాలి కదా..? సిగ్గుందా..? అంటూ ఫైర్ అయ్యారు.. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గించగానే చాలా రాష్ట్రాలు కూడా తమ పరిధి మేరకు ధరలు తగ్గించాయని.. కానీ, ఏపీలో ధరలెందుకు తగ్గించరు..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అధికారం ఉంది కదా అని బాదుడే బాదుడా..? అంటూ నిలదీసిన ఆయన.. పెట్రో ధరలు పెరిగితే పరిశ్రమలు, వ్యవసాయం కష్టంగా మారతాయన్నారు.. నిత్యావసర ధరలు పెరుగుతాయి.. రెండున్నరేళ్లల్లో ఓ పక్క విధ్వంసం.. మరో పక్క నిత్యావసరాలపై బాదుడు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై ఆందోళనలు చేపట్టనున్నట్టు పిలుపునిచ్చారు చంద్రబాబు.. పెట్రోల్ బంకుల వద్ద ఆందోళనలు చేయాలని టీడీపీ శ్రేణులకు సూచించిన ఆయన.. ప్రతిపక్షం అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ప్రభుత్వానికి ఉందా..? అంటూ ఫైర్ అయ్యారు.. పెట్రోల్, డీజిల్ ధరలను అన్ని రాష్ట్రాలకంటే తగ్గిస్తామని జగన్ చెప్పారుగా..? అలాగే చేయాలని డిమాండ్ చేసిన ఆయన.. పెట్రో ధరలు, నిత్యావసరాలు, మద్యం, ఇసుక, విద్యుత్, ఆర్టీసీ ఛార్డీల వంటివన్ని ఏపీలోనే అత్యధికంగా ఉన్నాయన్నారు.. అధికారం ఉందని అనుకుంటే కుదరదు.. ప్రజలు తిరుగుబాటు చేస్తే పారిపోయే పరిస్థితి వస్తుందన్నారు చంద్రబాబు.