దేశంలోని నదుల అనుసంధానంపై కసరత్తును కేంద్రం వేగవంతం చేసింది. గోదావరి-కావేరి నదులను లింక్ చేసేందుకు…ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే…ఐదు రాష్ట్రాల అధికారుల అభిప్రాయాలు తీసుకునేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. నదుల అనుసంధానం ద్వారా నదీజలాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఏర్పడింది.
దేశవ్యాప్తంగా ఉన్న నదుల అనుసంధానంపై కేంద్రం దృష్టి పెంచింది. దీనిపై ఈ నెల 18న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి హాజరు కావాలని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి జలవనరుల శాఖ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది. గోదావరి-కావేరి ప్రాజెక్టులో భాగస్వాములైన రాష్ట్రాలతో సంప్రదింపులు జరపనుంది కేంద్రం. గోదావరిలోని ఇచ్చంపల్లి బ్యారేజీ నుంచి నాగార్జున సాగర్, సోమశిల, తమిళనాడులోని గ్రాండ్ ఆనికట్ వరకు నదులను అనుసంధానించడానికి కసరత్తు చేస్తోంది.
మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల నీటి హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తోందని వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆరోపించారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జాతీయస్థాయిలో జలసత్యాగ్రహాన్ని చేపడతామన్నారు. నదుల అనుసంధానంతో రాష్టాలకు తీరని నష్టం జరుగుతుందని హెచ్చరించారు. జలసౌధలో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆయన…జలవనరులకు ప్రధాన ఆధారం నదులేనన్నారు. నీటిని వాణిజ్య సరుకుగా చేసేందుకు, ప్రైవేటీకరించేందుకు కేంద్రం పన్నాగాలు పన్నుతున్నదని ధ్వజమెత్తారు.
దేశవ్యాప్తంగా ఉన్న వాటర్ వారియర్స్‌తో ఈ నెల 26, 27తేదీల్లో జాతీయ సదస్సును నిర్వహించనున్నట్లు రాజేంద్రసింగ్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం జలసంరక్షణకు గడిచిన ఏడేళ్లలో ఎంతో కృషి చేసిందన్నారు. జాతీయ సదస్సుల్లో నీటి సంరక్షకులు, పర్యావరణవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారు.