వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తుల్ని పదునైన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ క్రమంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి పీఏలు రాఘవరెడ్డి, రమణారెడ్డిలతో పాటు హోంగార్డు నాగభూషణం, వేంపల్లికి చెందిన రహంతుల్లా, బండి కేశవ, మల్లీ అనే వ్యక్తులను విచారించారు. పులివెందుల ఆర్అండ్బీ గెస్ట్ హౌస్‌లో 8 మంది అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని తొలుత స్థానిక పోలీసులకు ఎలా సమాచారం అందించారని రాఘవరెడ్డిని అడిగినట్లు తెలిసింది. వివేకా హత్య జరిగిన సమయంలో పులివెందుల పట్టణ సీఐగా పనిచేసిన శంకరయ్య, హోంగార్డు నాగభూషణంరెడ్డిని ప్రశ్నించారు. వివేకా కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన ఇనయతుల్లా, వివేకా పీఏ జగదీశ్వర్ రెడ్డి తమ్ముడు ఉమాశంకర్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.