ఏపీలో వైఎస్ షర్మిలతో కలిసి ఆమె భర్త బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడతారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై బ్రదర్ అనిల్ స్పందించారు. ఏపీ వేదికగా తాము కొత్త పార్టీ పెడుతున్నామన్న విషయం పూర్తిగా అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ వచ్చిన బ్రదర్ అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో పాటు పలు బీసీ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో కూడా బ్రదర్ అనిల్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
మరోవైపు ఏపీ సీఎం జగన్‌పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం పని చేసిన క్రైస్తవులు, ఎస్సీలు ఇప్పుడు తీవ్ర ఆవేదనతో ఉన్నారని.. ఇటీవల తనతో సమావేశమైన కొందరు క్రైస్తవులు ఈ విషయం తనకు చెప్పారని బ్రదర్ అనిల్ వెల్లడించారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఉండవల్లి అరుణ్ కుమార్‌ను కలిసిన అంశం వేరే విషయంలో అని, త్వరలో ఆ వివరాలు చెబుతానని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు.