బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజేపీ ఇప్పటి వరకు అధికారంలోకి రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టడం ప్రారంభించబోతుందని తెలిపారు. బీజేపీ ఫోకస్ పెట్టే రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయన్నారు. త్వరలోనే ఏపీ, తెలంగాణలో బీజేపీలోకి ఇతర పార్టీల నుంచి చేరికలు ఉంటాయని జీవీఎల్ స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల్లో చాలా మంది నేతలు తమ కాంటాక్టులలోకి వస్తున్నారన్నారు.
ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీ వైసీపీ, ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుంచి బీజేపీలోకి వలసలు ఉంటాయని జీవీఎల్ తెలిపారు. టచ్ చేసి చూడు కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టనుందని.. ఏపీలో అన్ని పార్టీల నేతలను బీజేపీ టచ్ చేస్తుందని పేర్కొన్నారు. దీంతో బీజేపీలో చేరికలు విస్తృతం అవుతాయన్నారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మోదీ హవాను మరోసారి రుజువు చేశాయని జీవీఎల్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఫర్మామెన్స్ ఎన్నో రెట్లు ఎక్కువగా ఉండబోతుందని.. 2024లో 404 పార్లమెంట్ సీట్లను గెలవడమే లక్ష్యంగా బీజేపీ కృషి చేస్తోందన్నారు.
అటు ఏపీ బడ్జెట్‌పైనా బీజేపీ ఎంపీ జీవీఎల్ స్పందించారు. ఏపీ బడ్జెట్ ఉత్తుత్తి బడ్జెట్‌లా కనిపించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తమవిగా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. బడ్జెట్ ప్రసంగం జగనన్న స్తుతిలా సాగిందన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని.. వచ్చే ఆదాయం వడ్డీ కట్టడానికి కూడా సరిపోయేలా లేదన్నారు. నవ్యాoధ్ర కలను నీరు గార్చేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. కులాల కార్పొరేషన్ల నిధులు వాళ్లకు వెళ్లడం లేదని జీవీఎల్ విమర్శలు చేశారు. పేరుకి మాత్రమే కార్పొరేషన్లు.. అక్కడ టీ తాగేందుకు కూడా డబ్బులు లేవన్నారు. కార్పొరేషన్లకు నిధులిచ్చే చిత్తశుద్ధి ఏపీ ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. బడ్జెట్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నిధులేవి అంటూ ప్రశ్నించారు. బడ్జెట్‌ను పార్టీ మేనిఫెస్టోలాగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఈనెల 19న కడపలో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని.. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ సభ పెడుతున్నామని తెలిపారు.