Janasena and BJP Alliance: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ-భారతీయ జనతా పార్టీ మధ్య పొత్తు ఉందని పలు సందర్భాల్లో ఇరు పార్టీల నేతలు చెబుతూ వస్తున్నారు.. అవసరం అయితే.. బీజేపీకి బైబై చెప్పేందుకు కూడా సిద్ధమేనంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించి పొత్తుల వ్యవహారంలో కాకరేపారు.. కానీ, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఆ రెండు పార్టీల పొత్తుపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.. టీడీపీని కూడా కలుపుకుపోవాలని కొందరు అంటుంటే.. అసలు జనసేనతో పొత్తు ఉన్నా లేనట్టే.. అంటూ మరికొందరు నేతలు వ్యాఖ్యానించడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత మాధవ్ కీలక కామెంట్లు చేశారు.. పదాధికారుల సమావేశంలో ఏదో జరుగుతోందనే భావన చాలా మందిలో ఉంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే జాతీయ పార్టీ నిర్ణయం మేరకే ఉంటాయన్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం చేసే అంశం మీదే చర్చించామన్న ఆయన.. గతంతో పోల్చుకుంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్ల శాతం పెరిగిందన్నారు.. విశాఖలో ఓట్ల శాతం తగ్గింది.. కానీ, మిగిలిన చోట్ల ఓట్ల శాతం పెరిగిందన్నారు.
ఇక, జనసేనతో కలిసి ఉన్నాం.. కానీ, కలిసున్నా లేనట్టేనని మేం భావిస్తున్నాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాధవ్.. జనసేనతో కలిసి బీజేపీ ప్రజల్లోకి వెళ్తేనే పొత్తు ఉందని నమ్ముతారన్న ఆయన.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన మాతో కలిసి రాలేదని ఆరోపించారు.. తమ అభ్యర్థికి జనసేన మద్దతు ఉందని పీడీఎఫ్ చెప్పుకుంటుంటే.. ఆ విషయాన్ని ఖండించమని జనసేనను కోరినా ఖండించ లేదని విమర్శించారు. మాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి రావడం లేదనేది మా ఆరోపణ అన్నారు. మరోవైపు, మేం వైసీపీతో ఉన్నామనే ప్రచారాన్ని ప్రజలు నమ్మారు.. మేం బీజేపీ హైకమాండ్‌కు చెప్పే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నామని.. వైసీపీ చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మారని భావిస్తున్నాం అన్నారు. వైసీపీ వేసిన ఈ అపవాదును తుడుచుకునే ప్రయత్నం చేస్తాం.. మే నెలలో ఈ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్ వేస్తామని ప్రకటించారు. పొత్తుల విషయంలో అనేక ఆలోచనలు ఉన్నాయి.. మేం మాత్రం పార్టీ బలోపేతం గురించే ప్రయత్నం చేస్తాం.. పొత్తులు హైకమాండ్ చూసుకుంటుందని వ్యాఖ్యానించారు బీజేపీ నేత మాధవ్.