ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది కోసం బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా, భోధన, ప్రాంతీయ ఆస్పత్రుల్లో బయోమెట్రిక్ విధానం ఉంటుందని తెలిపింది. బయోమెట్రిక్ హాజరు అమలు కోసం ఆస్పత్రుల్లో సీసీటీవీలను ఏర్పాటు చేసింది.
డ్యూటీకి వచ్చి పర్మిషన్ లేకుండా బయటకు వెళ్తే సెలవుల్లో కోత ఉంటుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. డాక్టర్లతో పాటు సిబ్బంది డ్యూటీ సమయంలో ఆస్పత్రిలో ఉండకుండా సొంత పనులపై బయట తిరుగుతున్నారని ప్రజల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. దీంతో ఈ అంశంపై దృష్టిపెట్టామని.. అందుకే బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అటు వైద్య సిబ్బంది తాము ఆస్పత్రిలోనే ఉన్నామని గంట గంటకు సెల్ఫీ సంబంధిత వెబ్‌సైట్‌లో ఫోటోలు అప్‌లోడ్ చేయాలని ఆరోగ్య శాఖ కమిషనర్ కంఠమనేని భాస్కర్ ఇచ్చిన ఆదేశాల పట్ల వైద్య వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.