Ayyanna Patrudu: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన కామెంట్లు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు.. తొమ్మిది నెలల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్న ఆయన.. పార్టీ అధికారంలోకి రావడం ఎంతో దూరం లేదన్నారు. అయితే, తాను ఈసారి హోంమంత్రిని అవుతానని.. లా అండ్ ఆర్డర్ అంటే ఏంటో.. తాను చూపిస్తానన్నారు.. రాష్ట్రంలో ప్రస్తుతం శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.. అయితే, నిన్న ఆయన చేసిన కామెంట్లపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు అయ్యనపాత్రుడు..
హోం మంత్రి అధికారాలపై అయ్యన్న ఆసక్తికర కామెంట్లు చేశారు.. హోం మంత్రి అవుతానని నేనేం అనలేదన్న ఆయన.. నిన్న తాడికొండలో ఓ కార్యక్రమంలో పాల్గొంటే కాబోయే హోం మంత్రి అని కొందరు నినాదాలు చేశారని.. లా అండ్ ఆర్డర్ చేతుల్లో లేని హోం మంత్రి పదవి ఉంటే ఎంత.. లేకుంటే ఎంత..? హోం మంత్రి చేతుల్లోనే లా అండ్ ఆర్డర్ ఉంటే పవర్ ఫుల్ గా ఉంటుందని తాను చెప్పానని గుర్తుచేసుకున్నారు.. లా అండ్ ఆర్డర్‌తో కూడిన హోం మంత్రి ఉంటే.. ఏంటో చూపిస్తాం అని చెప్పానని.. తప్పు చేసిన ఐపీఎస్‌లు, పోలీసుల బట్టలూడదీయిస్తామని హెచ్చరించారు. హోం మంత్రి చేతుల్లో లా అండ్ ఆర్డర్ ఉంటే షూట్ ఎట్ సైట్ అవుతుందన్నారు.. ఇప్పుడే కాదు.. చాలా కాలంగా లా అండ్ ఆర్డర్ వింగ్ హోం మంత్రి చేతుల్లో ఉండడం లేదని విమర్శించారు అయ్యన్నపాత్రుడు.