నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదు. ఈ అంశంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. టీడీపీ గత సంప్రదాయాన్ని పాటించింది కాబట్టే ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ పోటీ పెట్టలేదని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే, ఎంపీలు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కుటుంబ సభ్యులు నిలబడితే పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని టీడీపీ పాటిస్తోందని అచ్చెన్నాయుడు తెలిపారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు.
1999లో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాగ్యానాయక్ చనిపోతే ఆయన భార్య ధీరావత్ భారతి నాయక్ అభ్యర్ధిగా నిలబడినప్పుడు టీడీపీ అధికారంలో ఉండి కూడా పోటీ చేయలేదని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 2009లో వైఎస్ఆర్ మరణిస్తే ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో విజయమ్మపోటీ చేసినపుడు కూడా అభ్యర్ధిని నిలబెట్టలేదన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే జగన్ రెడ్డి ఆ కుటుంబంలోని వ్యక్తికి కాకుండా ఇతరులకు సీటు ఇవ్వడంతోనే తెలుగుదేశం పార్టీ పోటీకి అభ్యర్ధిని నిలబెట్టిందన్నారు. ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికల్లో మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి సీటు కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ తప్పకుండా పోటీ చేసేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.