ఏపీలో నైట్ కర్ఫ్యూ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ వల్ల ప్రజలు ఇబ్బంది పడే అవకాశముందని సీఎం దృష్టికి వచ్చిందని ఎన్టీవీతో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వెల్లడించారు. దీంతో రాత్రి కర్ఫ్యూ అమలులో సడలింపు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారని… ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్షించారని… కరోనా ఎన్ని వేవ్‌లు వచ్చినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆళ్ల నాని పేర్కొన్నారు.
Read Also: ఏపీలో ఈనెల 31వరకు నైట్ కర్ఫ్యూ… జీవో విడుదల
సెకండ్ వేవ్ సందర్భంగా ఆక్సిజన్ కొరతతో చాలా ఇబ్బందులు పడ్డామని… ఈ నేపథ్యంలోనే 144 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను సీఎం జగన్ ప్రారంభించారని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. ప్రజలు కూడా కోవిడ్ నివారణ, కట్టడిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రజల సహకారంతోనే కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కోగలమన్నారు. మాస్క్ ధరించాలన్న రూల్‌ను కఠినంగా అమలు చేయనున్నామని తెలిపారు.