ప్రభుత్వ ఉద్యోగుల కొత్త పీఆర్సీ అమలు జీవోలను ఏపీ ప్రభుత్వం ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ఒప్పందం ప్రకారం ఏపీ సచివాలయ ఉద్యోగులు, హెచ్‌వోడీ కార్యాలయాలకు చెందిన ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏను వర్తింప చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. 2022 జనవరి 1 నుంచి హెచ్ఆర్ఏ పెంపు ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
హెచ్ఆర్ఏ గరిష్ఠ పరిమితి రూ. 25 వేలకు నిర్ధారిస్తూ ఉత్తర్వులలో అధికారులు స్పష్టం చేశారు. ఏపీ భవన్, హైదరాబాద్‌లలో పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 24 శాతం హెచ్ఆర్ఏ వర్తిస్తుందన్నారు. అదేవిధంగా 2.5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, 13 జిల్లా కేంద్రాల్లో బేసిక్ పే పైన 16 శాతం హెచ్ఆర్ఏ లేదా రూ.17వేల సీలింగ్‌ను నిర్ణయించారు. అదేవిధంగా 2 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 12 శాతం హెచ్ఆర్ఏ నిర్ధారణ రూ.13 వేలకు మించకుండా సీలింగ్ విధించారు. ఇక 50 వేలలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.11వేల సీలింగ్‌తో 10 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వనున్నారు.
మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్‌ను అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించిన అంశాలను కూడా తాజా ఉత్తర్వుల్లో వెల్లడించారు. 70 ఏళ్ల వయసున్న రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 7 శాతం పెన్షన్ అందనుంది. 75 ఏళ్ల వయసు వారికి అదనంగా 12 శాతం, 80 ఏళ్ల వారికి అదనంగా 20 శాతం, 85 ఏళ్ల వారికి అదనంగా 25 శాతం, 90 ఏళ్ల వయసు వారికి అదనంగా 30 శాతం, 95 ఏళ్ల వయసు రిటైర్డ్ ఉద్యోగికి అదనంగా 35 శాతం, 100 ఏళ్లకు పైగా వయసు ఉన్నవారికి అదనంగా 50 శాతం పెన్షన్ అందుతుంది.