AP DGP Rajendranath: ఈ ఏడాది ఏపీలో క్రైం రేటు తగ్గిందని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వెల్లడించారు. పెండింగ్ కేసుల సంఖ్య ఈ ఏడాది చాలా తగ్గిందన్నారు. లోక్ అదాలత్‌లో 57 వేల కేసులను పరిష్కరించామని.. శిక్షలు పడే శాతం ఈ ఏడాది పెంచేందుకు పాలసీ పరంగా మార్పులు చేశామని తెలిపారు. ఈ ఏడాది కన్విక్షన్ శాతం 66.2గా ఉందని.. మహిళలపై అత్యాచారాల, హత్య కేసులో 44 మందికి శిక్ష పడిందని డీజీపీ వివరించారు. 88.5 శాతం కేసుల్లో చార్జిషీట్లు వేశామన్నారు.
2021 కంటే 2022లో 60 వేల కేసులు తక్కువ నమోదు అయ్యాయని డీపీజీ తెలిపారు. 169 పీడీ యాక్టు కేసులు నమోదు చేశామని.. 2021లో 2,84,753 కేసులు నమోదు అవగా 2022లో 2,31,359 కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. మహిళా పోలీసుల వల్ల గ్రామాల్లో క్రైం చేసే వారి వివరాలు ముందే తెలుసుకోగలిగామని.. హత్యలు 945 నుంచి 857కి తగ్గాయని పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో దొంగతనాలు కొంత పెరిగాయని.. రోడ్డు ప్రమాదాలు జరగటానికి కారణాలు అన్వేషించామని.. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్పాట్స్ గుర్తించి అక్కడ చర్యలు చేపట్టామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.
ఎక్కువగా ప్రమాదాలు జరిగే సమయాలను గుర్తించి అక్కడ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టామని డీజీపీ చెప్పారు. టూ వీలర్ వల్ల 50 నుంచి 60 శాతం ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించామని.. వాహనాల వేగం తగ్గించటానికి బారికేడ్లు ఏర్పాటు చేయటం, అంతర్గత రోడ్లు ప్రధాన రోడ్లకు కలిసే చోట బారికేడ్ చేశామన్నారు. గత ఏడాదితో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు 19,200 నుంచి 18,739 తగ్గాయన్నారు. రోడ్డుప్రమాద మృతులు గత ఏడాది7430 మందిగా ఉంటే 2022లో 6800 మంది ఉన్నారన్నారు. టూ వీలర్స్ నడిపే వారు హెల్మెట్లు ఖచ్చితంగా ధరించాలని డీజీపీ హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ మంది హెల్మెట్లు లేక తలకు గాయమై ప్రాణాలు వదిలారని.. టూ వీలర్ నడిపే వారు హెల్మెట్లు ధరించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల మీద జరిగే క్రైం కూడా ఈ ఏడాది తగ్గిందన్నారు. ఈ ఏడాది సైబర్ నేరాలపై కేసులు ఎక్కువ నమోదయ్యాయని.. గతతేడాది 2039 సైబర్ కేసులు ఉంటే ఈ ఏడాది 2700 కేసులు నమోదైనట్లు డీజీపీ వివరించారు. 4 చోట్ల రీజనల్ సైబర్ సెంటర్స్ పెట్టి కొందరికి ట్రైనింగ్ ఇస్తామన్నారు.
Read Also: Chittoor District: నిరుద్యోగులకు శుభవార్త.. జిల్లా ఆస్పత్రిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ
దిశ యాప్ ను 85 లక్షల మహిళలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని.. దిశ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల్లో 1500 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని డీజీపీ వెల్లడించారు. వీక్లీ ఆఫ్ కొంత వరకు పోలీసులకు ఇస్తున్నామని.. నెలకు 4 వీక్ ఆఫ్స్ ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. కొత్తగా పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇది సాధ్యమవుతుందన్నారు. నాటు సారా కట్టడికి కఠిన చర్యలు చేపట్టామని.. 100 గ్రామాల్లో నాటు సారా తయారీ అడ్డుకున్నామని చెప్పారు.
ఏపీలో గంజాయి సాగుని ఆపడానికి చర్యలు తీసుకున్నామని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 600 ఎకరాల్లో గంజాయి సాగుని దహనం చేశామని.. 2.45 లక్షల గంజాయి సరఫరాను గుర్తించి సీజ్ చేసి దహనం చేశామన్నారు. వేరే రాష్ట్రాల్లో కూడా గంజాయి సాగు అడ్డుకోవాల్సి ఉందన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా గంజాయి సాగును దహనం చేశామని.. గంజాయి సాగు చేసే వారికి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు సబ్సిడీపై అందించామన్నారు. శాటిలైట్ ఫొటోస్ ద్వారా ఇంకా ఎక్కడైనా గంజాయి సాగు జరుగుతుందేమో చూసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.