అగ్రి ఇన్‌ఫ్రా ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.. రైతులకు మంచి ధర అందేలా అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆదేశించారు. వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలో పోటీని పెంచేలా చూడాలని.. దీని వల్ల రైతులకు మంచి ధర వస్తుందన్నారు. ధరల విషయంలో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా వెంటనే మార్కెట్‌లో జోక్యం చేసుకోవాలన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతులను ఆదుకునే చర్యలను దూకుడుగా చేపట్టాలని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్.. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది రాకుండా చూడాలన్నారు.
ఆర్బీకేల పనితీరు పై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయన్నారు సీఎం వైఎస్ జగన్.. ఆర్బీకేల వల్ల బయట మార్కెట్‌లో డీలర్ అమ్మే రేట్లకన్నా తక్కువ రేట్లకే వస్తున్నాయని.. రేట్లలో మోసం లేదు, క్వాలిటీలో కూడా మోసం లేకుండా పోయిందన్నారు. దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నా.. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నామని తెలిపారు సీఎం వైఎస్ జగన్.. ఆర్బీకేలపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఆయన.. ఆర్బీకేల ద్వారా ఎమ్మార్పీ ధరలకే నాణ్యమైన సీడ్, ఫీడ్, ఎరువులు రైతులకు అందుబాటులోకి రావడం వారికి ఇష్టం లేనట్టుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇక, ఆర్బీకేలను సబ్‌డీలర్లుగా మార్పు చేస్తున్నామని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు.. వచ్చే రబీ సీజన్‌నుంచి ఇది అమల్లోకి వస్తోందని సీఎంకు వివరించారు.. మరోవైపు.. వరి అధికంగా సాగవుతున్న ప్రాంతాల్లో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు సీఎం జగన్.. బోర్ల కింద వరిని సాగుచేసే చోట ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలన్న ఆయన.. 33 చోట్ల సీడ్ కమ్ మిల్లెట్ ప్రాససింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.