అసెంబ్లీలో సోమవారం నాటి పరిణామాలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. సభలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యుల తీరును తప్పుబట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగం సందర్భంగా టీడీపీ సభ్యులు ఆందోళన నిర్వహించి ప్రసంగం ప్రతులను చించివేయడం సరికాదని బీఏసీ సమావేశంలో సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కనీసం ఆయన వయసుకైనా గౌరవం ఇవ్వాలని, అలాంటిది కాగితాలు చించి ఆయనపై విసరడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని టీడీపీ నేత అచ్చెన్నాయుడు వద్ద సీఎం జగన్ ప్రస్తావించారు. చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదని.. టీడీపీ సభ్యుల తీరు అసెంబ్లీ పవిత్రను నాశనం చేసేలా ఉందని జగన్ అన్నారు.
అయితే గతంలో కూడా ఇలాంటి పని చేశారు కదా అని అచ్చెన్నాయుడు కౌంటర్ ఇచ్చారు. దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ.. గతంలో తాను ఇలా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. మంత్రి మండలిని రద్దు చేసుకుంటానని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాంతో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తాను అన్నది మీరు చేశారని కాదని.. గవర్నర్ ప్రసంగానికి నిరసన తెలపడం అనేది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా అనేకసార్లు జరిగిందని చెప్పడమే తన ఉద్దేశమని వివరించారు.