కరోనా వైరస్ సోకి మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాలను వర్తింపచేయడానికి ఏపీ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. అయితే ఈ కారుణ్య నియామకాల వర్తింపు ప్రభుత్వ ఉద్యోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్ల కుటుంబ సభ్యులకే ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి జూన్ 30లోగా ఉద్యోగం కల్పించేందుకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: గుడ్ న్యూస్… ఏపీలో కరోనా టెస్ట్ ధరలు తగ్గింపు
కాగా మృతి చెందిన ఉద్యోగి నిర్వహించిన పోస్టుకు సమానమైన ఉద్యోగం లేదా అంతకంటే తక్కువ స్థాయి హోదాతో కారుణ్య నియామకం చేపట్టనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా ప్రత్యేక పరిస్థితుల కారణంగా కారుణ్య నియామకాలను గత ఏడాది నవంబరు 30లోగా చేపట్టాలని నిర్ణయించినా పెద్ద మొత్తంలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. త్వరితగతిన వీటిని పరిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీల్లో అర్హులైన వారికి కారుణ్య నియామకం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి దరఖాస్తులను పరిష్కరించి తక్షణమే ఖాళీలను భర్తీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది.