ఏపీలో కొత్తగా 13 జిల్లాల ఏర్పాటు విషయంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల ఏర్పాటుపై కొన్నిచోట్ల అభ్యంతరాలు వినిపిస్తుండగా.. మరికొన్ని చోట్ల జిల్లాల పేర్ల విషయంలో కొత్త డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలకు వంగవీటి రంగ, భూమా నాగిరెడ్డి పేర్లు పెట్టాలనే డిమాండ్లు రాగా.. తాజాగా ఓ జిల్లాకు దివంగత దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు పేరు పెట్టాలని ఆయన అభిమాన సంఘం డిమాండ్ చేస్తోంది.
మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు ఏఎన్ఆర్ పేరు పెట్టాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు గుడివాడ రామాపురంలో పుట్టారని.. తెలుగు చిత్ర రంగంలో ఓ దిగ్గజంగా ఎదిగారని ఆయన అభిమానులు చెబుతున్నారు. చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకువచ్చే విషయంలో అక్కినేని ఎంతో కృషి చేశారని గుర్తుచేస్తున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న దిగ్గజ నటుడి పేరును జిల్లాకు పెట్టి ఆయనకు గుర్తింపు ఇవ్వాలని అక్కినేని అభిమానులు కోరుతున్నారు.
అంతేకాకుండా జిల్లాల విభజనలో మరికొన్ని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. రాయచోటికి బదులుగా రాజంపేటను, భీమవరం బదులుగా నర్సాపురాన్ని జిల్లా కేంద్రాలుగా ప్రకటించాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మదనపల్లె, ప్రకాశం జిల్లా మార్కాపురం, కర్నూలు జిల్లా ఆదోని, విశాఖ జిల్లాలోని రంపచోడవరం, నర్సీపట్నం కేంద్రాలుగగా జిల్లాలను ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు. అటు పుట్టపర్తి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.