Police High Alert: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులను తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు అరెస్టు చేయడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. ఒకపక్క రాయచోటి పట్టణంలోని పలు బహిరంగ ప్రదేశాలలో పోలీసులు గస్తీ కాస్తుండగా, మరోపక్క టెర్రరిస్టుల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కేరళకు చెందిన అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ (యూనిస్) అనే ఇద్దరు టెర్రరిస్టులు (అన్నదమ్ములు) బట్టల వ్యాపారం ముసుగులో రాయచోటిలో మకాం వేసి ఇద్దరు కలిసి రాయచోటి ప్రాంతానికి చెందిన మహిళలను వివాహం చేసుకున్నారు. వీరిలో అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ కు సంతానం లేకపోగా, మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ (యూనిస్) కు సంతానం కలిగి ఉన్నట్లు సమాచారం. అన్న అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ జడ్పీ హైస్కూల్ ఎదురుగా ఉండే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని అందులో ఓ చిల్లర దుకాణం ఏర్పాటుచేసి అక్కడ నుంచి కార్యకలాపాలు సాగించేవాడు. తమ్ముడు మహమ్మద్ అలీ అలియాస్ మన్సూర్ (యూనిస్) రాయచోటి పట్టణంలోని మహబూబ్ భాషా వీధిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ బట్టల షాపు ఏర్పాటు చేసి అక్కడ నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నారు.
Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరద ఉద్ధృతి.. మునిగిన 15 అడుగుల శివుడి విగ్రహం..(వీడియో)
అయితే, అన్న ఒకచోట, తమ్ముడు మరోచోట నివాసం ఉంటూ కొన్ని ఏళ్లగా ఉగ్ర కార్యకలాపాలు సాగించినట్లు సమాచారం. ఇద్దరు టెర్రరిస్టులు పేరుకు చిల్లర దుకాణం, బట్టల షాపు నిర్వహిస్తూ స్థానికులను నమ్మబలికించి వారు తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చారు. ఈ క్రమంలో తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఇద్దరు టెర్రరిస్టులను అరెస్టు చేసి తమిళనాడుకు తరలించడంతో అన్నమయ్య జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమయింది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు నివాసం ఉన్న ఇండ్ల వద్ద పోలీసులు పహారా కాస్తుండగా, టెర్రరిస్టుల కుటుంబ సభ్యులను, వీరికి ఇండ్లను అద్దె కు ఇచ్చిన యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకొని రహస్య ప్రాంతాలలో విచారిస్తున్నారు. అంతేకాకుండా నేడు తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొత్తపల్లిలో టెర్రరిస్ట్ నివాసంలో పోలీసులు తనిఖీలు చేసి పలు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తాను ఉంటున్న ఇంటిపై రెండో అంతస్తు నిర్మాణం చేపట్టాలని ఇంటి యజమానికి అబూబకర్ సిద్ధిక్ అలియాస్ నాగూర్ భారీ మొత్తంలో నగదు ముట్ట చెప్పినట్లు సమాచారం. ఈ ఇద్దరు టెర్రరిస్టులు రాయచోటి పట్టణంలో కొందరికి ఉగ్ర కార్యకలాపాలపై శిక్షణ ఇచ్చినట్లు రాయచోటి ప్రాంతంలో జోరుగా ప్రచారం సాగుతుంది. జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఉగ్ర కార్యకలాపాలు కొనసాగుతున్న అన్న అనుమానంతో పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.