అమరావతిలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని కొనసాగించాలంటూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన పాదయాత్రపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.. అమరావతి నుంచి అరసవల్లి వరకూ చేపట్టిన మహాపాదయాత్రలో ఉద్రిక్తతలు తలెత్తుతున్న నేపథ్యంలో.. అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది.. అయితే, మేం ఇచ్చిన ఆదేశాలకు లోబడే అమరావతి మహాపాదయాత్ర జరగాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది… పాదయాత్రలో 600 మంది రైతులు మాత్రమే పాల్గొనాలని స్పష్టం చేసింది హైకోర్టు.. ఎవరైనా పాదయాత్రకు సంఘీభావం తెలపాలనుకుంటే రోడ్డు పక్కనే ఉండి సంఘీభావం తెలపాలని పేర్కొంది… కోర్టు అనుమతించిన వారు తప్ప వేరేవాళ్లు పాదయాత్రలో పాల్గొనకూడదని హైకోర్టు ఆదేశించింది… ఇక, పాదయాత్రలో నాలుగు వాహనాలను మాత్రమే ఉపయోగించాలని సూచించింది.. కోర్టు ఆదేశాలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.
Read Also: Dasoju Sravan: బీజేపీకి ఊహించని షాకిచ్చిన దాసోజు.. మళ్లీ కారెక్కుతున్నాడు..
అంతే కాదు.. హైకోర్టు విధించిన నిబంధను పాటించడంలో విఫలమైతే మాత్రం అమరావతి పాదయాత్ర నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించింది హైకోర్టు.. కాగా, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు పాదయాత్ర కొనసాగిస్తుండగా.. ఉత్తరాంధ్రలో రైతుల పాదయాత్రపై నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.. అధికార వికేంద్రీకరణే లక్ష్యమని.. మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరుతామని అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తుండగా.. అమరావతి కోసం రైతుల చేస్తున్న పాదయాత్రపై ఆరోపణలు, విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలో.. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అడ్డంకులు కల్పిస్తోందని, పోలీసులు ఆంక్షలు విధిస్తున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి పిటిషన్ దాఖలు చేసింది.. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.