అభివృద్ధి వికేంద్రీకరణే మా లక్ష్యం అంటున్న అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ.. జేఏసీ ఇచ్చిన విశాఖ ఘర్జన పిలుపునకు మద్దతు ప్రకటించింది.. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన జనంతో సాగర తీరంలో గర్జన నిర్వహించారు.. అయితే, విశాఖ గర్జనపై సెటైర్లు వేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు.. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ పదాధికారుల సమావేశం ప్రారంభం అయ్యింది.. సోము వీర్రాజు అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి.. పార్టీ నేతలు శివప్రకాష్, దగ్గుబాటి పురంధేశ్వరి, సునీల్ దియోదర్, సత్యకుమార్, కన్నా లక్ష్మీనారాయణ, పదాధికారులు, ప్రత్యేక ఆహ్వానితులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. విశాఖపట్నం దేశంలోనే అభివృద్ధి చెందటానికి ఒక వ్యూహాత్మక ప్రాంతం అన్నారు.. 2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 7 లక్షల 16 వేల కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందని గుర్తుచేసిన ఆయన.. దేశంలోని 11 కారిడార్లలో మూడు రాష్ట్రానికే ఇచ్చాం.. పోర్టుకు లక్ష కోట్లు, డిఫెన్స్ రంగానికి రెండు లక్షల కోట్లు, అభివృద్ధి కార్యక్రమాల కోసం 50వేల కోట్ల రూపాయలను మోడీ ఇచ్చారని తెలిపారు.
Read Also: Palle Ravikumar : కాంగ్రెస్‌కు షాక్.. టీఆర్‌ఎస్‌లోకి పల్లె రవి దంపతులు
అయితే, విశాఖ గర్జన ప్రభుత్వ సభగా ఎద్దేవా చేశారు సోము వీర్రాజు.. ఇటువంటి డ్వాక్రా సభలు చిన్నప్పటి నుంచి చూస్తున్నానని సెటైర్లు వేసిన ఆయన.. వీరికి ఒక దశ లేదు, దిశ లేదు అంటూ మండిపడ్డారు.. ఇక్కడే రాజధాని (అమరావతి) పెడతానని ఇల్లు కట్టుకున్న వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు ఎందుకు విశాఖ రాజధాని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అభివృద్ధి వికేంద్రీకరణకు అసలు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు.. ఈ మూడేళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఏం చేశారో వైసీపీ శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షులు సోము వీర్రాజు.