భారతీయ జనతాపార్టీ ప్రపంచంలోనే అతిపెద్దరాజకీయ పార్టీగా అవతరించింది.. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రత్యేక కార్యపద్దతి వల్లే సాధ్యం అయ్యిందన్నారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమువీర్రాజు.. నెల్లూరులో నిర్వహించిన కిసాన్ మోర్చా శిక్షణ శిబిరం కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ఆయన.. బీజేపీ కార్యపద్ధతిపై ప్రసంగించారు.. 1951 నుండి 1977 వరకు భారతీయ జనసంఘ్ రూపంలో కొనసాగింది. ఆ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత జాతీయవాదం, సుపరిపాలన, పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తున్నామని వివరించారు. సమిష్టితత్వం, సహకారంతో బీజేపీ అజేయమైన శక్తిగా మారింది.. బీజేపీ సిద్ధాంతం ఆధారంగా పనిచేయడంతో పాటు.. కార్యకర్తల ఆధారంగా.. పార్టీ అంచెలంచెలుగా ముందుకు దూసుకెళ్తుందన్నారు.
ఇక, కార్యకర్తలు పనిచేసే సమయంలో పార్టీ మూలతత్వాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సోము వీర్రాజు.. కార్యపద్ధతిలో.. కార్యకర్త నిర్మాణం, కార్యకర్త వికాసం, కార్యకర్తను ఆకర్షించడం అత్యంత అవసరమన్న ఆయన.. పోలింగ్ బూత్ ఆధారంగా కార్యక్రమాలను నిర్మాణం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.. కమ్యూనికేషన్, కన్సల్టేషన్ ఈ రెండూ భారతీయ జనతా పార్టీ కార్యకర్త పద్ధతిలో చాలా ముఖ్యభూమిక నిర్వహించడం జరుగుతుందన్నారు.. ఈ సందర్భంగా సీనియర్ కార్యకర్తలు, నాయకుల పనివిధానాన్ని ఉదహారణగా చెప్పుకొచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు.