విశాఖ గర్జనను విజయవంతం చేసేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.. జేఏసీ పిలుపునకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించిన వైసీపీ.. జనసమీకరణపై దృష్టిసారించింది. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. భూమికోసం, భుక్తి కోసం, హక్కుల కోసం సాగిన ఉద్యమాల్లో పోరాటాలకు పుట్టినిల్లుగా నిలిచిన శ్రీకాకుళం జిల్లా నుండి రాజధాని వికేంద్రీకరణ చర్యకు మద్దతుగా నిలిచేందుకు మరో ఉద్యమానికి శ్రీకారంచుట్టాలని కోరారు. కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో ఏర్పాటు అయ్యేందుకు సంబంధించిన మద్దతుగా విశాఖ గర్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో నాలుగు మండలాల నేతలతో స్పీకర్ సమీక్షించారు. రేపు విశాఖపట్నంలో జరిగే రాజధాని వికేంద్రీకరణ మద్దతు ర్యాలీ సంబంధించి ప్రతి గ్రామం నుండి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మండల పార్టీ నాయకత్వంపై ఉందన్నారు.
విశాఖ గర్జన విజయవంతం చేయండి అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు స్పీకర్ తమ్మినేని.. రాజధాని వికేంద్రీకరణ మద్దతు సభకు అధిక సంఖ్యలో విశాఖపట్నం తరలిరావాలని సూచించారు. వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకోవడం అంటే. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని కోరుకుంటున్నట్లే.. మూడు రాజదానుల కోసం పార్టీ రాజకీయలా? మీ నాయకుడికి ఏలాగా చేతకాలేదు. దమ్మున్న మగాడు చేసే దానికి మద్దతు ఇచ్చి విజ్ఞాత తెలిపుకొండి.. లేదంటే మీరు చరిత్రలో చరిత్రహీనులగా మిగిలిపోతారంటూ టీడీపీ నేతలను ఉద్దేశించి హాట్ కామెంట్లు చేశారు. ఏ రాజకీయ పార్టీ మూడు రాజదానులకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ రాజకీయ పార్టీ తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చిన ఆయన.. .తాళికట్టిన ఆడది, మొలతాడు కట్టిన మొగాడు, మీసం ఉన్న ప్రతి ఒక్కడు విశాఖ గర్జనకు తరలిరావాలి పిలుపునిచ్చారు స్పీకర్ తమ్మినేని.
గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలి వచ్చేలా కృషి చేయాల్సిన బాధ్యత మండల పార్టీ నాయకత్వంపై ఉందన్నారు తమ్మినేని.. విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు ద్వారా ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు సరిహద్దు జిల్లాలు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందే వీలుందన్నారు. వీటిని క్షేత్రస్థాయిలో ప్రజల్లో ప్రచారం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. నిరక్షరాస్యత, నిరుద్యోగం వంటివి రూపు మాపాలి అంటే విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు చేయాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రతి ఒక్కరూ స్వాగతించాలని ఆయన సూచించారు. రాజధాని వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటున్న విపక్షాలు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని సమర్థించినట్లేనన్న ఆయన.. అమరావతి రైతులు సాగిస్తున్న పాదయాత్ర ప్రతిపక్ష పార్టీలకు మేలు చేకూర్చే రాజకీయ చర్యగా అభివర్ణించారు.