రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనుల బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. జిల్లాస్థాయిలో మంత్రి, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, పెండింగ్ బిల్లుల వివరాలు సేకరించి అక్టోబరు 31లోగా బిల్లులు చెల్లించాలని ఆయన కోరారు. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులను రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధులకు బాధ్యతలు తప్ప నిధులు లేవు.. బాధ్యతల నిర్వహణకు నిధుల కేటాయింపులు జాప్యం.. నిధుల కేటాయింపుపై శ్రద్ధ చూపకపోవడం.. నిధులు కేటాయించకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణనాతీతం అన్నారు..
సారంగాపూర్ మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, జిల్లా పరిషత్ అధ్యక్షులకు సైతం నిధుల కేటాయింపు లేకపోవడంతో బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని దుస్థితి నెలకుందని వారు వాపోతున్నారన్నారు. అప్పుల ఊబిలో సర్పంచులు కూరుకుపోయారన్న ఆయన.. గ్రామాల్లో రైతు వేదికలు, వైకుంఠధామాలు నిర్మించిన సర్పంచులకు వీళ్ళ తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు ఊబిలో కూరుకు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. రైతు వేదికలు నిర్మించాలంటూ ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్లకు బిల్లులు చెల్లించడంలో బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయం కూడా లేని గ్రామ పంచాయతీలకు సైతం ట్రాక్టర్లు కొనుగోలు చేయించడంతో వాయిదాలు కట్టలేని పరిస్థితి నెలకొంది అన్నారు. 2018లో కేటాయించిన కుల సంఘాల భవనాలు నిర్మించిన వారికి సైతం బిల్లులు రావడం లేదని విమర్శించారు.
ఇక, మిషన్ భగీరథ నీరు గ్రామాల్లో ఎవరూ తాగడం లేదని.. ఇంటింటికి డబ్బానీరు కొనుగోలు చేసుకుని తాగుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ తో కాంట్రాక్టర్కు తప్ప ఎవరికి ప్రయోజనం లేదని విమర్శించారు. మిషన్ భగీరథ తో ప్రభుత్వం అప్పుల ఊబిలోకి కోరుకుపోయిందన్నారు. మిషన్ భగీరథ నీరు కేవలం 20 కిలోమీటర్ల మేరకే క్లోరినేషన్ ప్రభావం ఉంటుందని, భగీరథ నీరు క్లోరినేషన్ చేసుకునే సదుపాయం గ్రామాల్లో లేకపోవడంతో క్లోరినేషన్ చేసిన నీరు గ్రామాలకు అందడం లేదన్నారు.. టీఆర్ఎస్ నాయకులు ప్రచార ఆర్భాటాలు మాని , గ్రామాల్లో భగీరథ నీటిని పరిశీలించాలని హితవు పలికారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మునుగోడును దత్తత తీసుకుంటానని మంత్రి కేటీఆర్ అనడం హాస్యాస్పదమని అన్నారు జీవన్‌రెడ్డి.. రాష్ట్రంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిన బాధ్యత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌దేనన్న ఆయన.. మంత్రి కేటీఆర్ రాష్ట్ర మొత్తానికి మంత్రి అనే విషయాన్ని మర్చిపోవద్దని హితవుపలికారు.