ఒక్కరోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం.. మొత్తం 5 గంటల 24 నిమిషాలు పాటు సభ జరిగింది.. ఏడు బిల్లులకు ఆమోదం లభించింది.. ఒక్క బిల్లును ఉపసంహరించుకోంది ప్రభుత్వం.. ఇక, రెండు బిల్లులకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక తీర్మానం.. కర్నూల్ ఎయిర్ పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలంటూ మరో తీర్మానం ప్రవేశపెట్టగా.. రెండు తీర్మానాలను ఏకగ్రీవంగా సభ ఆమోదించింది. ఇక, ఇవాళ బడ్జెట్ 2021-22ను ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకుంది సర్కార్.. 2021-22 రాష్ట్ర బడ్జెట్ అంచనా రూ.2,29,779.27 కోట్లుగా ఉండగా.. రెవెన్యూ వ్యయం – రూ.లక్షా 82 వేల 196 కోట్లుగా.. మూలధన వ్యయం రూ.47,582 కోట్లుగా.. రెవెన్యూ లోటు రూ.5 వేల కోట్లుగా.. ద్రవ్యలోటు – రూ.37,029.79 కోట్లుగా ఉంది. ఈ సమావేశాలను తెలుగుదేశం పార్టీ బహిష్కరించిన సంగతి తెలిసిందే. కానీ, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూనే.. టీడీపీని, చంద్రబాబును టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు సీఎం వైఎస్ జగన్.