Gorantla Madhav: అనంతపురం జిల్లాలో ఉన్న వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు వచ్చారు. సెక్షన్ 35/ త్రి బీఎన్ఎస్ కింద గోరంట్ల మాధవ్ కు నోటీసులు ఇచ్చారు. మార్చ్ 5వ తేదీన సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు హాజరు కావాలని మాజీ ఎంపీ మాధవ్ కు నోటీసులు అందజేశారు. నవంబర్ 2వ తేదీ 2024న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో మాజీ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో, గోరంట్ల మాధవ్ పై 72, 79 బీఎన్ఎస్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఫోక్సో కేసులో బాధితురాలి పేరు గోరంట్ల మాధవ్ చెప్పారని కేసు నమోదు చేశారు.
ఇక, పోలీసుల నోటీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. ఈ సందర్భంగా, నోటీసులు ఇంకా చూడలేదు.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని పెట్టిన కేసు ఇది.. కేసు వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాట్లాడతా.. మాట్లాడే హక్కును, భావ ప్రకటన స్వేఛ్చాను ఈ ప్రభుత్వం హరిస్తోంది.. రాష్ట్రమంతటా భయంకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.. తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులు చేసుకుంటూ పోతే.. రాష్ట్రంలో అంతర్యుద్ధం రాక తప్పదు అని వెల్లడించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీరు చేస్తున్నవి గుర్తు పెట్టుకోండి.. మార్చి 5వ తేదీన నా లీగల్ అడ్వయిజరీతో కలిసి పీఎస్ కి వెళ్లి విచారణకు సహకరిస్తా.. మార్చి 5న నాకు ఎలాంటి కార్యక్రమాలు లేకపోతే విచారణకు హాజరవుతాను అని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వెల్లడించారు.