JC Prabhakar vs Pedda Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ… మరోవైపు జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో శివుడి విగ్రహావిష్కరణ. దీంతో.. ఇవాళ ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. గతం వైసీపీ ప్రభుత్వ హయాంతో పాటు.. కూటమి సర్కార్‌లోనూ తాడిపత్రి పాలిటిక్స్ కాకరేపుతూనే ఉన్నాయి.. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది..
హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్లనున్నారు పెద్దారెడ్డి. అయితే, మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు జేసీ ప్రభాకర్‌రెడ్డి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలిరావాలని జేసీ ఇప్పటికే పిలుపు ఇచ్చారు. అయితే.. శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్‌రెడ్డికి పోలీసులు సూచించారు. కానీ… ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామంటున్నారు జేసీ వర్గీయులు. దీంతో, తాడిపత్రిలో ఏం జరుగుతుంది అనేది టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది..