Pendurthi: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. కిందిస్థాయిలో కొన్ని చోట్ల విభేదాలు బయటపడుతున్నా.. రాష్ట్రస్థాయిలో అంతా బాగానే ఉంది అనిపిస్తోంది.. కూటమి నేతలు ఒకే వేదికపై కనిపించినప్పుడూ.. వారి మధ్య మంచి వాతావరణం ఉందని స్పష్టం అవుతోంది.. అయితే, కొన్ని చోట్ల కూటమి నేతలకు చికాకులు తప్పడం లేదు.. తాజాగా, అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ కూటమి పార్టీలు మధ్య కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల… టీడీపీ ఇంచార్జ్ గండిబాబ్జీ మధ్య వర్గ విబేధాలు నడుస్తుండగా.. ఇప్పుడు మేయర్ పీలా శ్రీనివాస్ ఆ జాబితాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విధానాలను వ్యతిరేకిస్తూ కేడర్ మీటింగ్ లో ఫైర్ అయ్యారు మేయర్ పీలా. ఇంచార్జిగా గండిబాబ్జీ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్..
Read Also: Gautam Adani: పూరీ జగన్నాథుడి రథయాత్రలో అదానీ కుటుంబం..
అయితే, నియోజకవర్గ పరిశీలకుడు సమక్షంలోనే మేయర్ పీలా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదనేది మేయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.. పార్టీలో నేను సీనియర్ నాయకుడినే… పార్టీలో శిక్షణ కలిగిన నేతను.. ఏనాడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదు.. అయినా, ఎందుకు కనీస సమాచారం ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, పరిశీలకుడు, ముఖ్య అనుచరులు వారించే ప్రయత్నం చేస్తే మేయర్ ఆగ్రహంతో తోసేసి మరీ తన అభిప్రాయం కుండబద్ధలు కొట్టేశారు. ఇప్పుడు.. పెందుర్తి టీడీపీలో అంతర్గత కుమ్ములాటల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.