అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గ కూటమి పార్టీలు మధ్య కొత్త కుంపటి రాజుకుంది. ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల... టీడీపీ ఇంచార్జ్ గండిబాబ్జీ మధ్య వర్గ విబేధాలు నడుస్తుండగా.. ఇప్పుడు మేయర్ పీలా శ్రీనివాస్ ఆ జాబితాలో చేరారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ విధానాలను వ్యతిరేకిస్తూ కేడర్ మీటింగ్ లో ఫైర్ అయ్యారు మేయర్ పీలా. ఇంచార్జిగా గండిబాబ్జీ ఏకపక్ష ధోరణి అవలంభిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు మేయర్.
ఉమ్మడి విశాఖ జిల్లా కూటమి పార్టీల మధ్య కుంపట్లు గట్టిగానే రాజుకుంటున్నాయట. మిగిలిన నియోజకవర్గాలతో పోలిస్తే పెందుర్తిలో పరిణామాలు సెగలు పొగలు కక్కేస్తున్నట్టు చెబుతున్నారు. జనసేన గెలిచిన ఈ స్ధానంలో... సిట్టింగ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోందట. ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో... పోలీసు, ఇతర కీలక శాఖల పోస్టింగుల విషయంలో ఇద్దరి మధ్య తలెత్తిన విభేదాలు పెద్ద అగాధమే సృష్టించినట్టు చెప్పుకుంటున్నారు.
పంచకర్ల రమేష్ బాబు...! గండి బాబ్జీ...! కూటమి పార్టీల్లో సీనియర్ నేతలు...కేరాఫ్ పెందుర్తి. ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే అయితే మరొకరు మాజీ శాసనసభ్యుడు. ఎన్నికల సమయంలో కలిసి వుంటే కలదు సుఖం అని డ్యూయెట్లు పాడుకున్న ఈ నేతల మధ్య ఇప్పుడు కోల్డ్ వార్ జరుగుతోందని జనసేన, టీడీపీ కేడరే తెగ చెవులు కొరికేసుకుంటోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో కీలకమైన నియోజకవర్గాల్లో పెందుర్తి ఒకటి. అర్బన్, గ్రామీణ ప్రాంతాల కలబోత కావడంతో ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమే. ప్రధాన పార్టీల ఫోకస్ కూడా ఎక్కువే. ఇక్కడ ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే.. తర్వాత ఎన్నికల్లో గెలవకపోవడం పెందుర్తి సెంటిమెంట్. 2019లో ఈ సీటును వైసీపీ గెలుచుకోగా.. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి టీడీపీ పుంజుకుంది. ఇప్పుడు మళ్లీ ఎలక్షన్ మూడ్ వచ్చేసింది. పెందుర్తిపై పట్టుకోసం వైసీపీ, టీడీపీ వేయని ఎత్తుగడలు లేవు. అయితే ప్రతిపక్ష…