Vadapalli: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రసిద్ధ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఆలయంలో టికెట్ కౌంటర్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న రామవరపు రుషేంద్ర భక్తులను మోసం చేస్తూ.. నగదు దోపిడీకి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. ఇక, రూ.200 దర్శన టికెట్ల విషయంలో ఆన్‌లైన్‌లో నగదు చెల్లించిన భక్తులకు కొన్ని సందర్భాల్లో డూప్లికేట్ టికెట్లు ఇచ్చినట్లు వెల్లడైంది.
Read Also: Alyssa Healy Retirement: షాకింగ్.. ఆస్ట్రేలియా కెప్టెన్ అలీసా హీలీ రిటైర్మెంట్!
మరోవైపు, కొందరు భక్తులకు తన వ్యక్తిగత ఫోన్ పే యాప్‌ను స్కాన్ చేయించి, నకిలీ టికెట్లు జారీ చేస్తూ అక్రమంగా నగదు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. ఈ అక్రమ వ్యవహారాన్ని గమనించిన ఒక భక్తుడు ఆలయ అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది. ఫిర్యాదు మేరకు ఆలయ ఈవో చక్రధర్ రావు విచారణ చేపట్టారు. విచారణలో, గత మూడు వారాలుగా సుమారు రూ.52,200 నగదును స్కాన్ చేసి రుషేంద్ర తన వ్యక్తిగత ఖాతాలో జమ చేసుకున్నట్టు గుర్తించారు. ఈ ఘటనపై ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలో భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అధికారులు నిర్ణయించారు.