కృష్ణా-గోదావరి నదుల్లోకి పెద్ద ఎత్తున వరద ప్రవహం వస్తుందని అంతా అప్రమత్తంగా వుండాలన్నారు ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. జులై రెండో వారంలోనే గోదావరికి ఇంత పెద్ద ఎత్తున వరద గత 100 ఏళ్లల్లో ఎప్పుడూ జరగలేదు. ఆకస్మికంగా వరదలు రావడం వల్ల కొఁత ఇబ్బంది ఏర్పడింది. నిర్వాసితుల తరలింపుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గోదావరిలో 16 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. మరింత వరద వచ్చే సూచనలు కన్పిస్తోందన్నారు.
వరద వల్ల వచ్చే ఇబ్బందులను వీలైనంత మేర తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం. ఎన్జీఓల సేవలు తీసుకుంటాం. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద కూడా గోదావరి వరద ఉధృతంగా ఉంది. పెన్నా నదిపై గతంలో ఉన్న ఆనకట్టల ఆధునికీకరణ పనులు దాదాపు పూర్తయ్యాయి. వచ్చే నెల 17వ తేదీన నెల్లూరు, సంగం బ్యారేజీలను సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ రెండు బ్యారేజీల ఆధునికీకరణ పనులను వైఎస్ శంకుస్థాపన చేస్తే.. జగన్ ప్రారంభిస్తున్నారని చెప్పారు మంత్రి అంబటి రాంబాబు.
ఇదిలా వుంటే.. తెలుగు రాష్ట్రాలకు మరో ఐదు రోజులు వాన గండం వుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. చురుగ్గా కదులుతున్న రుతుపవనాలు, కొనసాగుతున్న షీర్ జోన్ ఎఫెక్ట్ వల్ల వర్షాలు పడతాయి. దక్షిణ కోస్తా ఒడిశాను అనుకుని బలహీన పడ్డ తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. దీనికి తోడు అనుబంధ ఉపరితల ఆవర్తనంతో కొనసాగనుంది వర్షాల తీవ్రత. రాబోయే ఐదు రోజులు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల్లో నీళ్లని నింపుకునే ప్రయత్నం చేస్తున్నాం.గోదావరిపై పెద్దగా డ్యాములు లేవు.. భద్రాచలం నుంచి వచ్చే నీరంతా నేరుగా పోలవరం వద్దకు చేరుతుంది.పోలవరం ప్రాజెక్టు నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయగలం.ప్రస్తుతం పోలవరం వద్ద 16 లక్షల క్యూసెక్కుల నీరు స్పిల్ వే ద్వారా విడుదల అవుతోంది.ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పూర్తి కాకపోవడంతో కొద్దిపాటి ఇబ్బంది ఉంది.పోలవరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం వల్ల భద్రతను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంది.పోలవరం ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం.ప్రస్తుతం వస్తున్న వరదల వల్ల ఢయాఫ్రమ్ వాల్ కు ఎలాంటి కొత్తగా జరిగే డామేజ్ ఏం ఉండదు.గతంలో వచ్చిన రెండు వరదల కారణంగా ఢయాఫ్రమ్ వాల్ దెబ్బతింది.. ఇంతకు మించి ఈ వరదల వల్ల జరిగే నష్టం ఏం ఉండదన్నారు మంత్రి అంబటి.
ఎన్నికల్లోగా ప్రయార్టీ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తాం. పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితుల సమస్యను దశల వారీగా పరిష్కరిస్తాం. పోలవరంపై శ్వేత పత్రం విడుదల చేస్తాం అని వివరించారు మంత్రి అంబటి రాంబాబు.ప్రభుత్వం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నాగార్జున సాగర్ కెనాల్ నుంచి నీటి విడుదలను వాయిదా వేస్తున్నాం.ప్రస్తుతం వర్షాలు, వరదల కారణంగా ఎన్సీపీ నుంచి నీటిని వారం రోజుల తర్వాత విడుదల చేస్తాం.ప్రస్తుతం వర్షాలు, వరదలు వస్తున్న కారణంగా ఎన్సీపీ కెనాల్ పరిధిలోని రైతులకు నీరు అందుతుందని అంచనా వేస్తున్నాం.వారం రోజుల తర్వాత నీటిని విడుదల చేస్తే.. మరింత మేలు జరుగుతుందన్న నిపుణుల సూచనల మేరకు వాయిదా వేశామన్నారు అంబటి.