ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. సభ ప్రారంభమైన వెంటనే జంగారెడ్డి గూడెం సంఘటనకు సంబంధించి న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేశారు. పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకుంటామని స్పీకర్ ముందే హెచ్చరించినా టీడీపీ సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ పలువురు టీడీపీ నేతలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు టీడీపీ నేతలపై ఆరోపణలు చేశారు.
సభ సంప్రదాయాలకు భిన్నంగా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్స్, కేకలు వేయడం సరికాదని హితవు పలికారు. వారి తీరు చూస్తుంటే వారు సభలోకి ఆయుధాలు తీసుకువచ్చినట్లు అనిపిస్తోందని.. వారు ఏయే ఆయుధాలు తీసుకువచ్చారో చెక్ చేయాల్సిన అవసరం ఉందని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. స్పీకర్ చైర్ వైపుకు వేలు చూపిస్తూ మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకే శాసనసభలోకి టీడీపీ సభ్యులు విజిల్స్ తీసుకువచ్చారని అంబటి రాంబాబు ఆరోపించారు.