Posani Krishna Murali Case: సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు ఈ రోజు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యారు.. దీంతో, 24 రోజుల ఉత్కంఠకు తెరపడినట్టు అయ్యింది.. అయితే, ఇతర కేసుల్లో బెయిల్ మంజూరు అయినా.. పోసానికి సీఐడీ నమోదు చేసిన కేసులో కూడా బెయిల్ దక్కడంతో గుంటూరు జైలు నుంచి బయటకు వచ్చారు.. జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే తన సన్నిహితులతో కలసి హైదరాబాద్ కు బయల్దేరి వెళ్లారు పోసాని కృష్ణ మురళి.. అయితే, పోసాని వ్యవహారం 30 ఫిర్యాదులు.. 17 కేసులు.. 24 రోజుల జైలు జీవితంలా సాగింది..
ఎట్టకేలకు 24 రోజుల ఉత్కంఠకు తెర పడింది.. సీఐడీ కేసులో గుంటూరు జిల్లా జైలులో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి నుంచి బెయిల్ పై ఇవాళ విడుదలయ్యారు.. సాయంత్రం 4.50 గంటల సమయంలో జిల్లా జైలు అధికారులు పోసానిని రిలీజ్ చేశారు.. జైలు బయటకు వచ్చిన పోసానిని మాజీ మంత్రి అంబటి రాంబాబు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.. బాగున్నానని అంబటికి పోసాని అందరికీ అభివాదం చేసి తన సన్నిహితుల వాహనంలో హైదరాబాద్ వెళ్ళిపోయారు.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. సోషల్ మీడియాలో పోస్టులు చేశారన్న ఆరోపణలపై గత ఫిబ్రవరి 26వ తేదీన హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో అన్నమయ్య జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి వివిధ పోలీస్ స్టేషన్‌లకు.. కోర్టులకు.. జైళ్లకు.. పోసాని కృష్ణమురళిని పీటీ వారెంట్ లపై తిప్పారు.. ఆయనపై రాష్ట్ర వ్యాప్తంగా 30 ఫిర్యాదులకుగానూ 17 కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 26వ తేదీన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో నమోదైన కేసుకు గానూ ఆయన అరెస్ట్ అయ్యారు.
అయితే న్యాయస్థానాల్లో ఊరట లభించే లోపు వరుసగా ఒక్కో పీఎస్‌లో నమోదైన కేసులకు గానూ ఆయన్ని తరలిస్తూ వచ్చారు. పీటీ వారెంట్లపై నరసరావుపేట, గుంటూరు, అధోని, విజయవాడ పోలీసుల విచారణ చేపట్టారు. పలు జైళ్లలో రిమాండ్ ఖైదీగా ఆయనను ఉంచారు. కర్నూలు జైలులో ఉండగా దాదాపుగా అన్ని కేసుల్లో పోసానికి బెయిల్ లభించింది, కానీ, మరో కొత్త కేసు మీద ఆయన్ని గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నాకు బెయిల్ మంజూరు చేయపోతే అఘాయిత్యం చేసుకుంటాను, నాకు ఆరోగ్యం అసలు బాగలేదు అంటూ జడ్జి ముందు పోసాని కన్నీళ్లు పెట్టుకున్నారని సమాచారం.. పోసానిని ఇప్పటి వరకు అరెస్ట్ అయి మూడుసార్లు రిమాండ్‌కు వెళ్లగా.. మూడు సార్లు కూడా ఆయనకు బెయిల్ లభించింది. జైలు నుంచి బయటకు వస్తారని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సీఐడీ పీటీ వారెంట్ వేసి పోసానిని అదుపులోకి తీసుకుని గుంటూరు కోర్టులో హాజరుపర్చారు. అందులో భాగంగా గుంటూరు కోర్టు ఆయనకు ఈనెల 23 వరకు రిమాండ్ విధించింది. ఒకరోజు సీఐడీ కస్టడీకి కూడా కోర్టు అనుమతించింది. దీంతో బెయిల్ కోసం ఆయన గుంటూరు కోర్టులో పిటీషన్ వేయటంతో విచారణ చేపట్టిన కోర్టు పోసానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
నిన్న పోసాని బెయిల్ పిటిషన్ పై విచారించిన సీఐడీ కోర్టు పోసానికి బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది. చివరకు ఇవాళ సాయంత్రం ఆయనను జైలు అధికారులు అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేసి ఆయనను విడుదల చేశారు. పోసాని కృష్ణమురళికి సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, లక్ష రూపాయల విలువైన రెండు బాండ్లను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. షూరిటీ పత్రాల సమర్పణలో ఆలస్యం కారణంగా ఆయన విడుదల ఇవాళ్టికీ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జైలు వద్ద ఉదయం నుంచి ఉత్కంఠ నెలకొంది.. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో రిలీజ్ ఆర్డర్స్ జిల్లా జైలుకు చేరాయి. దీంతో అధికారులు విడుదలకు సంబంధించిన ఫార్మాలిటీలను పూర్తి చేశారు. పోసాని విడుదల సమయంలో ఆయన న్యాయవాదులు గుంటూరు జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. వారి సమక్షంలోనే జైలు అధికారులు అవసరమైన పత్రాలను పరిశీలించి, విడుదల ప్రక్రియను పూర్తి చేసి సాయంత్రం 5 గంటల తర్వాత ఆయనను విడుదల చేశారు.. అనంతరం ఆయన సన్నిహితులతో కలసి హైదరాబాద్ లోని నివాసానికి బయలుదేరి వెళ్లినట్లు తెలుస్తోంది.. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలనే షరతుపై పోసాని కృష్ణమురళికి పలు కోర్టులు బెయిల్ ఇచ్చాయి. అలాగే మరికొన్ని కేసుల్లో నోటీసు ఇచ్చి విచారణ జరపాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు ఏ క్షణమైనా తిరిగి ఆయన్ను విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.. గతంలోనూ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో బెయిల్ లభించిన తర్వాత జైలు నుంచి విడుదలయ్యే లోపే సీఐడీ పోలీసులు తమ కేసులో పీటీ వారెంట్ దాఖలు చేసి ఆయనను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. చివరికి 24 రోజుల జైలు జీవితం గడిపిన తర్వాత పోసాని ఇవాళ విడుదలయ్యారు. దీంతో ఆయనకు పూర్తి ఊరట లభించినట్లయింది..