అమరావతిలో పార్టీ కార్యకర్తలతో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలోని ప్రతీ ఒక్కరూ పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ పార్టీ కంటే ఎక్కువ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించమని ప్రతిజ్ఞ చేయాలని కోరారు. సోషల్ మీడియాలో కానీ బహిరంగంగా కానీ తోటి సభ్యులతో వ్యక్తిగత గొడవలకు దిగటం, అవమానకరంగా వ్యవహరించొద్దని ఆయన సూచించారు. పార్టీ ప్రతిష్టకు, సమగ్రతకు భంగం కలిగేలా ప్రవర్తించిన వారు ఎవరైనా సరే వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయంలో జనసేన పార్టీ జీరో టాలరెన్స్ విధానం అవలంభిస్తుందని నాగబాబు తెలిపారు. అధినేత పవన్ కల్యాణ్ తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
Read Also: Hyderabad : పోలీసులా.. మజాకా.. అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్.. వీడియో..
రాష్ట్రం, దేశంలోని భావి తరాల ఉజ్వల భవిష్యత్తు కోసమే పవన్ కల్యాణ్ నిర్ణయాలు ఉంటాయని నాగబాబు తెలిపారు. అధ్యక్షుడు అన్ని వైపుల నుంచి ఆలోచించి, వివిధ అంశాలపై నిర్దిష్టమైన వ్యూహాత్మక విధానాన్ని కలిగి ఉంటారని పేర్కొన్నారు. బాహ్య ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి పార్టీ స్థిరంగా ఉంటుందని.. కొన్ని నిర్ణయాలు పార్టీలోని కొంత మంది వ్యక్తులకు స్వల్పకాలిక వ్యక్తిగత ఇబ్బందులకు గురి చేయవచ్చని చెప్పుకొచ్చారు. కానీ అంతిమంగా ఈ నిర్ణయాలు రాష్ట్ర, దేశ ఉన్నతమైన ప్రయోజనాలకు మేలు చేసే విధంగా తీసుకుంటారని నాగబాబు అన్నారు. పార్టీని బలపరిచేందుకు అన్ని NRI జనసేన విభాగాలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగు వేయాలని మనస్పూర్తిగా ప్రోత్సహిస్తున్నామని.. మనందరం కలిసికట్టుగా, ఐకమత్యంతో పార్టీని ముందుకు తీసుకెళ్లదామని నాగబాబు కార్యకర్తలకు సూచించారు.