మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో అంగన్వాడి, ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు, దొడ్ల, గ్రామ మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో తమ వినతులు ఇవ్వడానికి వచ్చిన ఏటూరు నాగారం మండలం దొడ్ల గ్రామానికి చెందిన మహిళలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీతక్క.. పోలీస్ స్టేషన్ కు వెళ్లి దొడ్ల గ్రామ మహిళలు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ ను పరామర్శించి అరెస్ట్ కు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
Read Also: Adiyae : అనుకున్న సమయం కన్నా ముందే ఓటీటీ లోకి వచ్చేసిన సైంటిఫిక్ రొమాంటిక్ మూవీ..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని అన్నారు. తమ సమస్యలపై వినతులు ఇవ్వడానికి వస్తున్న వారిని అరెస్ట్ చేయడం బాధాకరం అని తెలిపారు. ములుగు జిల్లా వ్యాప్తంగా గత కొంత కాలంగా అంగన్ వాడి ఉద్యోగులు, ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహార దీక్షలు చేస్తున్నారు. వారి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోగా.. వారిని అరెస్టులు చేసి భయబ్రాంతులకు గురి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. అక్రమ అరెస్ట్ లు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని సీతక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Read Also: Rajanna Sirisilla: ఇంటి ఆవరణలో గంజాయి మొక్కల పెంపకం.. 48 ఏళ్లుగా సాగు