Cyclone Montha: మొంథా తుఫాన్‌పై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు నాయుడు.. కీలక ఆదేశాలు జారీ చే శారు.. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.. పునరావాస కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి, నాణ్యమైన ఆహారాన్ని అందించాలి.. పునరావాస కేంద్రాలకు ప్రత్యేకంగా ఇంఛార్జ్‌లను నియమించాలి.. పునరావాస కేంద్రాల్లో ఒక్కో కుటుంబానికి రూ.3,000 చొప్పున నగదు, అలాగే 25 కేజీల బియ్యంతో సహా నిత్యావసరాల పంపిణీ చేయాలి.. తాగునీటి సమస్య తలెత్తకుండా, ఎక్కడా కలుషితం కాకుండా చూసుకోవాలి.. తుఫాను ప్రభావిత జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలి.. ఎక్కడా ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించకుండా అధికారులు బాధ్యత తీసుకోవాలి.. జిల్లాల్లో తుఫాను రక్షణ చర్యలను పర్యవేక్షించాల్సిన బాధ్యత కలెక్టర్లదే అని స్పష్టం చేశారు..
వాలంటరీగా వచ్చేవారిని తుఫాన్ సహాయక కార్యక్రమాలకు వినియోగించుకోవాలి.. ప్రభుత్వ యంత్రాంగమంతా నిబద్ధతతో పనిచేసి మొంథా తుఫాన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని సూచించారు సీఎం చంద్రబాబు.. మానవ ప్రయత్నంలో ఎటువంటి అలసత్వం కనిపించకూడదు అన్నారు.. వివిధ జిల్లాల కలెక్టర్లతో అక్కడ పరిస్థితులను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. నెల్లూరు జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయని చెప్పిన జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా.. అన్ని రక్షణ చర్యలు తీసుకున్నామని సీఎంకు వివరించారు శుక్లా.. ఆర్టీజీఎస్ నుంచి సమాచారం అందుతుంది… ఎక్కడా చెరువులు, కాలువ గట్లు తెగిపడకుండా చూసుకోవాలి.. భారీ వర్షాలతో నీరు ఎక్కడా నిలిచిపోకుండా డ్రైనేజీ వ్యవస్థను పర్యవేక్షించాలి.. తుఫాను సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా చూసుకోవాలి.. విజయవాడ, మంగళగిరి, విశాఖ వంటి కొండ ప్రాంతాల్లో కొండచరియలు జారిపడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలి.. మొంథా తుఫాన్ కార్యాచరణ భవిష్యత్‌లో వచ్చే తుఫాన్లను ఎదుర్కొనేందుకు ఒక మోడల్ కావాలి అని ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు..
మొంథా తుఫాన్ ప్రభావాన్ని, నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరేలా రియల్ టైమ్‌లో సమాచారం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి ఈ రోజు ఉదయం నుంచి ప్రతీ గంటకూ తుఫాన్ బులిటెన్లు విడుదల చేస్తూ, అప్రమత్తం చేయాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో మొంథా తుఫాన్ కారణంగా నెలకొన్న పరిస్థితులు, చేపట్టాల్సిన సహాయక చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోడీ సీఎం చంద్రబాబు కు ఫోన్ చేశారు..తుఫాన్ పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.. సమీక్ష లో అధికారులకు సీఎం పలు సూచనలు చేశారు… ఎక్కడా సమాచార పంపిణీ వ్యవస్థకు అంతరాయం కలగకుండా చూసుకోవాలని సీఎం చెప్పారు. కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు శాటిలైట్ ఫోన్లు వినియోగించాలని, మొబైల్ టవర్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తుఫాన్ ప్రభావం ఎక్కువ ఉండే 2,707 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. 110 మండలాల్లోని సచివాలయాల్లో 3,211 జెనరేటర్లను పవర్ బ్యాకప్ కోసం వినియోగించాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఎక్కడా కమ్యూనికేషన్ వ్యవస్థకు అవాంతరాలు తలెత్తకూడదన్నారు. తుఫాన్ వల్ల ఎవరూ ప్రమాదాలబారిన పడకూడదని, ఒక్క మరణం సంభవించకూడదనేది ప్రభుత్వ లక్ష్యం కావాలన్నారు.
యాంటీ స్నేక్ వెనోమ్, యాంటి ర్యాబిస్ వ్యాక్సిన్లు కూడా అన్ని పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. మరోవైపు పంటనష్టం సంభవించకుండా టార్పాలిన్లు విరివిగా ఉంచాలని, పశుసంపద నష్టపోకుండా చూడాలని ముఖ్యమంత్రి చెప్పారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో 851 జేసీబీలు, 757 పవర్ సాలు సిద్ధం చేశామని అధికారులు చెప్పగా, ఏ ప్రాంతంలో అందుబాటులో ఉంచారనేది మ్యాపింగ్ చేయాలని… తుఫాన్ అనంతరం వీటన్నింటి వినియోగంపైనా ఆడిటింగ్ చేస్తామని సీఎం చెప్పారు. వరద నీరు వెళ్లేందుకు వీలుగా డ్రెయిన్లలో బ్లాక్స్ లేకుండా పటిష్టం చేయాలని నిర్దేశించారు. .తుఫాన్ తీరం దాటే సమయంలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అలర్ట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు సందేశాలు పంపించి అవగాహన పెంచాలని.. తిత్లీ, హరికేన్, హుద్‌హుద్ తుఫాన్లపై అనుభవాన్ని ఇప్పుడు వినియోగించాలనని సీఎం సూచించారు.. అన్ని రిజర్వాయర్లు, ట్యాంకులు ఎలా నిర్వహించాలనే దానిపై జిల్లా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయండి. రియల్ టైమ్‌లో నీటి ప్రవాహాలను పర్యవేక్షించాలన్నారు.. బలమైన గాలులకు కూలిపోయే అవకాశం ఉన్న చెట్ల కొమ్మలను ముందుగానే తొలిగించాలి.’ అని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. అలాగే తుఫాన్ రక్షణ విధుల్లో అలసత్వం వహించే వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి హెచ్చరించారు. సమీక్షలో మంత్రులు లోకేష్, అనిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, వివిధ శాఖలకు చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు….