JC Prabhakar Vs Adinarayana Reddy: బూడిద లోడింగ్, తరలింపు వ్యవహారం కూటమి నేతల మధ్య చిచ్చు పెట్టింది.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై వివాదం రోజురోజుకు ముదురుతోంది.. బూడిద లోడింగ్ చేసే వరకు మా వాహనాలు కదిలే ప్రసక్తే లేదు అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు తేల్చిచెప్పారు.. ఇక, జేసీ, దేవగుడి కుటుంబాల మధ్య బూడిద వివాదం ముదరడంతో ఎల్ అండ్ టీ కంపెనీతో పాటు అనేక సిమెంట్ కంపెనీలకు బూడిద సరఫరా నిలిచిపోయింది.. తమ లారీలకు ఫ్లైయాష్ లోడింగ్ చేయకపోతే తామే జేసీబీలతో లోడింగ్ చేసుకుంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పట్టు పట్టడంతో పరిస్థితి తారాస్థాయికి చేరింది. తమకు రావాల్సిన పాత బకాయిలతో పాటు ఎల్ అండ్ టీ కంపెనీ ట్రాన్స్‌పోర్ట్‌లో 50 శాతం కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఇవ్వాలంటూ పట్టుబట్టారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు. దీంతో ఫ్లైయాష్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవహారం చిలికి చిలికి గాలి వానలా మారింది.
Read Also: Health: కలుషిత గాలి వల్ల దగ్గు, జలుబే కాకుండా.. ఈ ప్రమాదకర వ్యాధులు..!
అయితే, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్లింది కడప జిల్లా ఆర్టీపీసీ ఫ్లైయాస్ వివాదం.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య బూడిద తరలింపు, సరఫరాపై ఆరా తీస్తున్నారు.. ఘటనపై సీఎంవో అధికారులు, జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. బూడిద తరలింపు విషయంలో రాజకీయ వివాదంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరు పార్టీల నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేలా నేతల వ్యవహారం ఉందని మండిపడ్డారు.. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించేలా అధికార పార్టీ నేతలు వ్యవహరిస్తే ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు.. మొత్తం ఘటనపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.. శాంతి భద్రతల విషయంలో ఎక్కడా సమస్య రాకుండా చూడాలని, ఈ విషయంలో కఠినంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు..