Waqf Amendment Act: వక్ఫ్ సవరణ చట్టం-2025 పై కీలక తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు. ఈ చట్టంలోని ముఖ్యమైన ప్రొవిజన్ ను నిలిపివేసింది. అయితే, మొత్తంగా చట్టంపై స్టే విధించాలంటూ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చింది. అయితే, వక్ఫ్ చట్టంపై సుప్రీం తీర్పును స్వాగతించారు మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.. సీఎం చంద్రబాబు కృషితోనే జేపీసీ దృష్టికి వక్ఫ్ చట్ట సవరణలు వెళ్లాయని.. మూడు అంశాలపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందన్నారు.. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం సవరణలపై ముస్లిం వర్గాలలో నెలకొన్న ఆందోళనను దృష్టిలో పెట్టుకొని, వారి మనోభావాలకు అనుగుణంగా వక్ఫ్ చట్టంను జేపీసీ దృష్టికి వెళ్లేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేశారు.. అప్పుడు జేపీసీ కొన్ని అసమంజస సవరణలను తొలగించగా, నేడు సుప్రీం కోర్టు మధ్యంతర తీర్పులో మిగిలిన అసమంజస సవరణలపై స్టే విధించిందని వెల్లడించారు.
వక్ఫ్ చట్ట సవరణల అమలుపై సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పును వెల్లడించి రాజ్యాంగపరంగా కల్పించిన హక్కులను కాపాడి, తన ఔన్నత్యాన్ని చాటి చెప్పడంతో ప్రజల విశ్వాసాన్ని గెలిచింది అన్నారు ఎన్ఎండీ ఫరూక్.. వివాదస్పద అస్థిని కలెక్టర్ విచారణ చేసి అనుమతిస్తే తప్ప అది వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడదన్న సవరణ, అయిదేళ్లుగా ఇస్లాం పాటిస్తున్న వ్యక్తి మాత్రమే వక్ఫ్ కి దానం చేయగలడు అనే సవరణపై స్టే విధించడం జరిగింది.. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్‌లో, ముస్లిమేతర సభ్యులు నలుగురు కంటే ఎక్కువ ఉండకూడదని, అలాగే రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులు ముగ్గురు కంటే ఎక్కువ ఉండకూడదని, వీలయినంత వరకు ముస్లింనే రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈవోగా నియమించాలని సుప్రీంకోర్టు చెప్పిందన్నారు మంత్రి ఫరూక్.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు ఏపీ మైనారిటీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్..