Cyclone Montha Damage: మొంథా తుఫాన్ విధ్వంసం సృష్టించింది.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. అయితే, నష్టంపై ప్రాథమిక అంచనాలు వేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ముగించుకుని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. తుఫాన్ వల్ల వచ్చిన నష్టంపైనా, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపైనా ఆర్టీజీఎస్ నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. సహాయక చర్యలు ఏ విధంగా కొనసాగుతున్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు.. విద్యుత్ సరఫరా, రహదారుల పునరుద్ధరణ తక్షణం జరగాలని స్పష్టం చేశారు.. ఎక్కడా వర్షం నీరు నిలిచిపోకుండా డ్రైనేజీలను పటిష్ట పరచాలని, పారిశుధ్య పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.. పునరావాస కేంద్రాల్లోని కుటుంబాలకు బియ్యం, నిత్యావసరాల పంపిణీ వేగంగా జరగాలని పేర్కొన్నారు..
Read Also: Montha Effect : తెలంగాణలో అక్కడ నిలిచిన రాకపోకలు.. ఆరు జిల్లాలకు రెడ్ అలర్ట్
ఇక, తుఫాన్ తీరం దాటడంతో రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు అధికారులు.. రాష్ట్రంలో 1,209 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి… 1.16 లక్షల మందికి ఆశ్రయం కల్పించామని తెలిపారు.. రాష్ట్రంలో మొత్తం 249 మండలాలు, 1,434 గ్రామాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుఫాన్ ప్రభావం పడిందని.. తుఫాన్ నష్టంపై తాజా వివరాలను సీఎంకు వివరించిన అధికారులు. రాష్ట్రంలోని 304 మండలాల్లోని 1,825 గ్రామాల్లో 87 వేలహెక్టార్లలో పంటకు నష్టం జరిగిందని తెలిపారు.. 59 వేలకు పైగా హెక్టార్లలో నీట మునిగిన వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం జరిగిందన్నారు.. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయారు.. రాష్ట్ర వ్యాప్తంగా 42 పశువులు చనిపోయాయి.. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్లు, 14 బ్రిడ్జిలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి.. 2,294 కిలో మీటర్ల పొడవున ఆర్ అండ్ బీ రహదారులు దెబ్బతిన్నాయి… రూ.1,424 కోట్ల నష్టం జరిగింది.. రూరల్ వాటర్ సప్లయ్‌కు సంబంధించి రూ.36 కోట్లు వరకు, ఇరిగేషన్ పనుల్లో రూ.16.45 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.. మరోవైపు సురక్షిత ప్రాంతాలకు 3,175 మంది గర్భిణీలను తరలించాం.. 2,130 మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాం.. 297 రహదారులపై వరద నీరు పొంగి ప్రవహిస్తుండగా, వాటిని దారి మళ్లించేలా చర్యలు తీసుకున్నాం.. రాష్ట్రంలో మొత్తం 380 చెట్లు రహదారులపై విరిగిపడగా, అన్నింటినీ తెలిగించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వివరించారు అధికారులు..