Govt employee Kidnap: అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నెలకొన్న ఓ కిడ్నాప్ కేసు మిస్టరీగా కొనసాగుతుంది. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి సోయం శ్రీ సౌమ్య (26) ని ఐదుగురు వ్యక్తులు నిన్న ఉదయం కిడ్నాప్ చేశారు. అయితే, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో, కశింకోటకు చెందిన అనిల్ అనే యువకుడు సచివాలయం దగ్గరకు వచ్చి, శ్రీ సౌమ్యను ఇన్నోవా వాహనంలో తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి సీసీ కెమెరా ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా మరిన్ని క్లూస్ సేకరించేందుకు పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
అయితే, గతంలోనూ శ్రీ సౌమ్య, అనిల్ ఇద్దరూ పెళ్లి చేసుకునేందుకు ఒడిశాకు పారిపోయినట్లు పోలీసుల విచారణ తేలింది. అప్పట్లో తల్లిదండ్రుల ఫిర్యాదుతో వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధం కొనసాగుతున్నదని స్థానికులు తెలిపారు. ఇక, నిన్న జరిగిన కిడ్నాప్ ఘటనలో శ్రీసౌమ్యను మారేడుమిల్లి నుంచి ఒడిశా చిత్రకొండ ప్రాంతం వైపు అనిల్ తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇక, ఇది నిజంగా కిడ్నాపా? లేక సౌమ్య స్వచ్ఛందంగా వెళ్లిందా? అనే కోణంలో విచారణ చేస్తున్నారు. మరోవైపు, తమ కుమార్తెను తిరిగి తమ వద్దకు చేర్చాలని, శ్రీ సౌమ్య తల్లిదండ్రులు దేవీపట్నం పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు.