అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా బెనిఫిట్ షో వేస్తామని చెప్పి బాలాజీ థియేటర్ యాజమాన్యం డబ్బులు వసూలు చేసిందని.. అయితే బెనిఫిట్ షో వేయలేదంటూ అభిమానులు ఆందోళనకు దిగారు. బాలాజీ థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో కోసం ఒక్కొక్కరి నుంచి రూ. 500 వసూలు చేసిందని అభిమానులు ఆరోపించారు. ఈ మేరకు థియేటర్ వద్ద బోర్డు కూడా ఏర్పాటు చేశారని చెప్పారు.
Read Also: దేశవ్యాప్తంగా రెండు రోజులు లాక్ డౌన్?
అయితే శుక్రవారం ఉదయం సినిమా థియేటర్ వద్దకు వెళ్లిన అభిమానులకు నిరాశ ఎదురైంది. థియేటర్ యాజమాన్యం బెనిఫిట్ షో వేయకపోవడంతో అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. దీంతో పలువురు అభిమానులు థియేటర్‌పై రాళ్లు రువ్వారు.ఈ విషయం తెలిసిన పోలీసులు రంగంలోకి దిగి అభిమానులను చెదరగొట్టారు. థియేటర్ గేట్లు మూసివేశారు. కాగా ఏపీలో బెనిఫిట్ షో లు వేయవద్దని ప్రభుత్వం ఇటీవల జీవో నంబర్ 35ను జారీ చేసిన విషయం తెలిసిందే.