ఏపీ సీఎం జగన్‌పై నటుడు అలీ మరోసారి ప్రశంసల వర్షం కురిపించారు. ఏపీలో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు పూర్తవడంతో పాటు త్వరలో ప్లీనరీ జరగనున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఆదివారం నాడు వైసీపీ ప్రవాసాంధ్రులు నిర్వహించిన మహా గర్జనలో నటుడు అలీ పాల్గొన్నారు. వైసీపీ ఆస్ట్రేలియా కోఆర్డినేటర్ చింతలచెరువు సూర్యనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వైసీపీ అభిమానులు తమ కుటుంబసభ్యులతో సహా హాజరయ్యారు.
ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. ఏపీలో సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. అవినీతికి తావులేకుండా ప్రజల వద్దకే సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్‌కు మాత్రమే దక్కుతుందని అలీ తెలిపారు. ఏపీ సీఎం జగన్ అద్భుతమైన పాలనను అందిస్తున్నారని నటుడు అలీ ప్రశంసించారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైపీసీనే అని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొనడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు.