గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వేస్టేషన్‌లో సోమవారం రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొందరు ప్రయాణికులపై దాడి చేసి రూ.89 లక్షల సొత్తు ఎత్తుకుపోయారు. దుర్గి మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైల్వేస్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫారంలో చెన్నై వెళ్లేందుకు ఎస్-6 బోగీ ఆగే ప్రదేశంలో రైలు కోసం ఎదురుచూస్తున్నారు.
అయితే అదే సమయంలో పక్కనే ఉన్న రైల్వే ఖాళీ స్థలం నుంచి ఆరుగురు వ్యక్తులు రైలు కోసం వేచి చూస్తున్న ముగ్గురు ప్రయాణికుల వద్దకు వచ్చారు. పోలీసులు పిలుస్తున్నారంటూ వారిని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి వారిని చితకబాది వారి వద్ద ఉన్న రెండు బ్యాగులను లాక్కుని వైట్ కలర్ కారులో పారిపోయారు. ఆ బ్యాగులలో రూ.89 లక్షల సొత్తు ఉందని బాధితులు వాపోతున్నారు. ఈ నగదును వ్యాపార పనుల నిమిత్తం చెన్నైకి తీసుకువెళ్తున్నట్లు వారు తెలిపారు. ఈ ఘటనపై వారు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే ఇది ఎవరో కావాలనే చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు.