ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం (OTS) కింద ఖజానాకు బాగానే డబ్బులు వచ్చి చేరుతున్నారు. ఇప్పటివరకు ఈ పథకం కింద అన్ని జిల్లాల్లో కలిపి రూ.339 కోట్లు వసూలు అయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. 9.86 లక్షల మంది లబ్ధిదారులు రూ.10,000 చొప్పున చెల్లించి తమ ఇళ్లు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారని ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం అత్యధికంగా వినియోగించుకున్న లబ్ధిదారుల జాబితాలో టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉండటం గమనించదగ్గ విషయం.
చిత్తూరు జిల్లాలో జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం కింద రూ.61 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో రెండో స్థానంలో తూర్పుగోదావరి జిల్లా నిలిచింది. తూ.గో. జిల్లాలో రూ.41 కోట్లు వసూలయ్యాయి. నెల్లూరు జిల్లాలో రూ.32 కోట్లు, ప్రకాశం జిల్లాలో రూ.28 కోట్లు, గుంటూరు, కర్నూలు జిల్లాలలో రూ.25 కోట్ల చొప్పున వసూళ్లు వచ్చాయి. విశాఖపట్నం జిల్లాలో రూ.23 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా అత్యల్పంగా విజయనగరం జిల్లాలో రూ.12 కోట్లు OTS ఫీజు కింద వసూలయ్యాయని ప్రభుత్వం పేర్కొంది.