కర్నూలు జిల్లాలో 2019 ఎన్నికల నిధుల్లో గోల్ మాల్ జరిగిందా? అడ్డగోలుగా ఖర్చు చేసి బిల్లులు సమర్పించడంలో నిబంధనలకు నీళ్లొదిలారా? ఆడిట్ లో అక్రమాలు బయటపడుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అక్రమాలు, నిబంధనలు అతిక్రమించడం ఆడిట్ లో వెలుగు చూస్తున్నాయి. అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ నుంచి ముగ్గురు సీనియర్ ఆడిటర్లు కర్నూలు కలెక్టరేట్ ఎన్నికల విభాగంలో రెండు రోజులుగా ఆడిటింగ్ కొనసాగిస్తున్నారు. ఎన్నికల నిధుల్లో ఖర్చు చేసిన మొత్తానికి సమర్పించిన బిల్లులు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణకు ఖర్చు చేసిన మొత్తంలో 5 కోట్లు బిల్లులు పెండింగ్ ఉన్నాయని, అదనపు నిధులు మంజూరు చేయాలని 2020 లో కలెక్టరేట్ ఏవో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడంతో 2021లో అదనపు నిధులు మంజూరు చేశారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో కోటి 25 లక్షలకు సంబంధించి బిల్లులపై , నోట్ ఫైల్ పై అప్పటి కలెక్టర్, డి ఆర్ ఓ సంతకాలు చేయాల్సి ఉండగా ఆ తరువాత వచ్చిన అధికారులు సంతకాలు చేసినట్లు ఆడిట్ లో తేలింది. జిల్లా కేంద్రంలో చేసిన ఖర్చులకు 3 కోట్ల 28 లక్షలు, 14 నియోజకవర్గాల్లో కోటి 5 లక్షలు మంజూరు చేశారు. 2 కోట్లకు సంబంధించిన బిల్లులపై అప్పటి కలెక్టర్ , డిఆర్ ఓ, ఎన్నికల సూపరెంటెండెంట్ సంతకాలు లేవు. ఈ నిధుల్లో కొంత మేరకు ఇతర ఖాతాలోకి మళ్లించడం, సరైన పత్రాలు సమర్పించకపోవడం ఆడిట్ లో బయటపడింది.
ఎన్నికల సందర్భంగా రాయలసీమ యూనివర్సిటీ, మరో ఇంజినీరింగ్ కాలేజీ వద్ద రెండు అదనపు జనరేటర్లు, కలెక్టర్ బంగ్లాలో ఒకటి అద్దెకు 3 లక్షల 63 వేలు ఖర్చు అయినట్టు బిల్లులు పెట్టారు. అద్దె మొత్తంతో కొత్త జనరేటర్లు కొనుగోలు చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫర్నిచర్ కొనుగోలు చేయకపోయినా కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టారని విమర్శలు ఉన్నాయి. మిస్ లేనియస్ ఖర్చులు 11 లక్షల 42 వేలు చేశారట. పోలింగ్ తరువాత రాయలసీమ యూనివర్సిటీ , మరో ఇంజినీరింగ్ కాలేజి లో 40 రోజులు ఈవీఎంలను భద్రపరిచారు. అక్కడ వీఐపీ తరహాలో అభ్యర్థులకు వసతి ఏర్పాటు చేసినట్లు 62 లక్షల 33 వేలు బిల్లులు పెట్టారు. వాస్తవంగా ఆ ప్రాంతంలోకి ఎవరినీ అనుమతించలేదు. మొత్తమ్మీద ఎన్నికల నిధులపై ఆడిటింగ్ అక్రమాలను బట్టబయలు చేసింది.
Read Also: Ap Highcourt: సంక్షేమ వసతి గృహాల దుస్థితిపై హైకోర్ట్ ఆగ్రహం