ఏపీలో వచ్చే నెల నుంచి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పాలనను ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఒకవైపు జిల్లాల పునర్విభజనపై వివిధ ప్రాంతాల్లో పలు డిమాండ్లు, అభ్యర్థనలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం వాటిని పక్కకు పెట్టి పాలన అందించడంపైనే దృష్టి పెట్టింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సుమారు 11వేల అభ్యంతరాలు, విజ్ఞప్తులు వచ్చినట్లు తెలుస్తోంది. కొన్ని జిల్లాలకు జిల్లా కేంద్రాలు మార్చాలని.. మరికొన్ని జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలని డిమాండ్లలో ఉన్నాయి.
ప్రభుత్వానికి వచ్చిన 11వేల డిమాండ్లలో కొన్ని:
★ పలాస, చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్‌లు చేయాలి
★ మన్యం జిల్లా పేరు మార్చి పార్వతీపురం జిల్లాగా పిలవాలి
★ సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలాన్ని విజయనగరం జిల్లాలో కలపాలి
★ ఎస్.కోట, పెందుర్తి నియోజకవర్గాలను విశాఖ జిల్లాలో కలపాలి
★ అనకాపల్లి బదులు నర్సీపట్నం కేంద్రంగా కొత్త జిల్లా చేయాలి
★ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను, దాని టౌన్ షిప్ మొత్తాన్ని విశాఖ జిల్లాలోనే ఉంచాలి
★ రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి
★ భీమవరం బదులు నర్సాపురాన్ని జిల్లా కేంద్రంగా చేయాలి
★ పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాలను విజయవాడ జిల్లాలోనే ఉంచాలి
★ నర్సరావుపేట జిల్లా బదులు గురజాల కేంద్రంగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలి
★ రేపల్లె కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి
★ తెనాలికి సమీపంలో చుండూరు, వేమూరు మండలాలను బాపట్ల జిల్లాలో కాకుండా గుంటూరు జిల్లాలోనే ఉంచాలి
★ గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, మార్కాపురం కలిపి మార్కాపురం జిల్లా ప్రతిపాదన
★ కందుకూరును ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి
★ శ్రీసత్యసాయి జిల్లాను హిందూపురం కేంద్రంగా ఉంచాలి
★ రాయచోటికి బదులుగా రాజంపేటనే జిల్లాగా చేయాలి
★ మదనపల్లె, ఆదోనిలను కొత్త జిల్లాలుగా చేయాలి
★ నందికొట్కూరు, డోన్ నియోజకవర్గాలను కర్నూలు జిల్లాలో కలపాలి