వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ సైతం అలర్ట్ అవుతోంది. ఈమేరకు ఆపార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేననే సంకేతాలను తాజాగా పంపిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ఆపార్టీ వినియోగించుకుంటోంది. ఓవైపు వైసీపీకి ఎంపీపీ పీఠాలు దక్కకుండా చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన పార్టీని టీడీపీ నేతలు లైన్లో పెడుతున్నట్లు అర్థమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు ఇటీవల వెల్లడయ్యాయి. గత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో వైసీపీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. అక్కడక్కడ టీడీపీ, జనసేన పార్టీలు సీట్లను సాధించాయి. గత ఎన్నికలతో పొలిస్తే గ్రామాల్లో కొంత పుంజుకున్నట్లు కన్పిస్తోంది. మొత్తంగా ఈ ఎన్నికల్లో టీడీపీ 917ఎంపీటీసీలను గెలుచుకోగా జనసేన 177, బీజేపీ 28 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్నాయి.
జనసేన, టీడీపీకి కొన్ని జిల్లాల్లో వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే వైసీపీకి చెక్ పెట్టే అవకాశం ఉంది. ఈ రెండు పార్టీలు సీట్లను సర్దుబాటు చేసుకుంటే సుమారు ఎనిమిది మండలాల్లో వైసీపీకి ఎంపీపీ పీఠం దక్కకుండా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఈ రెండు పార్టీల నేతలు పొత్తు పొట్టుకునేందుకు కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచిన ఎంపీటీసీ స్థానాల కన్నా టీడీపీ, జనసేన పార్టీలు గెలిచిన సీట్లే ఎక్కువ ఉన్నాయి.
ఈమేరకు ఈరెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని టీడీపీ నేతలు చంద్రబాబుకు సూచిస్తున్నారు. ఈమేరకు మాజీ మంత్రి పితాని సత్యానారాయణ తాజాగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జనసేనతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన చంద్రబాబుకు సైతం సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు విడివిడిగా పోటీ చేసి మంచి ఫలితాలు సాధించడంతో ఉమ్మడిగా పోటీ చేస్తే వైసీపీని అడ్డుకోవచ్చనే భావన ఇరుపార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
ప్రస్తుతం జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కొనసాగిస్తోంది. గత తిరుపతి ఉప ఎన్నిక తర్వాత ఈ రెండు పార్టీలు కొద్దిగా దూరంగా ఉన్నట్లు కన్పిస్తున్నాయి. ఎవరికీ వారు తమతమ కార్యక్రమాలను చేసుకుంటూ పోతున్నారు. ఒక పార్టీ పిలుపు ఇచ్చిన కార్యక్రమంలో మరో పార్టీ పాలుపంచుకోవడం లేదు. మరోవైపు జనసేన-బీజేపీ పొత్తు అధినాయకత్వం నుంచి కింది స్థాయి వరకు ఇష్టం లేదని తెలుస్తోంది. దీంతోనే జనసేన సైతం టీడీపీ పొత్తుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ముందస్తు పొత్తుల వ్యూహంలో భాగంగానే టీడీపీ, జనసేనలు ప్రస్తుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ సీట్లను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. జనసేనతో పొత్తుకు టీడీపీ నేతల నుంచే ఎక్కువగా డిమాండ్ విన్పిస్తోంది. దీంతో చంద్రబాబు సైతం ఆమేరకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి గెలిచే సత్తా లేకపోవడంతో ఇప్పటి నుంచి ఆపార్టీ జనసేనను లైన్లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బలమైన శక్తిగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న జనసేనాని టీడీపీతో పొత్తు పెట్టుకుంటురా? లేదా అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.