హుజూరాబాద్ ఉప ఎన్నిక హోరాహోరీగా జరుగడం ఖాయంగా కన్పిస్తోంది. ప్రచారంలో టీఆర్ఎస్, బీజేపీ ఢీ అంటే ఢీ అన్న రీతిలో దూసుకెళుతున్నాయి. ఎవరికీవారు తగ్గెదేలే అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ఇంకా మైదానంలోకి దిగనట్లే కన్పిస్తోంది. పోలింగ్ తేదికి మరో 23రోజులే ఉన్నా కాంగ్రెస్ మాత్రం జోరు చూపించడం లేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఆపార్టీ నేతలతీరు ఉంది. దీంతో అసలు కాంగ్రెస్ రేసులో ఉందా? లేదంటే సైడ్ అయిందా? అనే చర్చ జోరుగా సాగుతోంది.
మాజీమంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈసారి ఆయన బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈటల రాజేందర్ ప్రధానంగా సానుభూతి పవనాలు, ప్రజా వ్యతిరేకతను నమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు అండగా బీజేపీ పెద్దలు రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ లో బీజేపీ తప్పకుండా గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ తేది సమీపిస్తుండటంతో ఈటల రాజేందర్ ప్రచారంలో స్పీడును పెంచారు.
ఈటల రాజేందర్ కు ధీటుగా టీఆర్ఎస్ వ్యూహాలను రచిస్తోంది. ఈటలను ఒంటరి చేసేలా ఆయన వెంట వెళ్లిన గులాబీ నేతలను తిరిగి సొంత గూటికి రప్పిస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ చేపడుతూ వలసలను ప్రోత్సహిస్తోంది. టీఆర్ఎస్ మంత్రులు హరీష్ రావు, మంత్రులు గంగుల కమాలకర్, కొప్పుల ఈశ్వర్ నియోజకవర్గంలో తిష్టవేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ డైరెక్షన్లో వారంతా ముందుకెళుతున్నారు. సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్ఎస్ ను గెలిస్తాయని ఆపార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు హుజూరాబాద్లో హోరీహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ మాత్రం పోటీ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి టీపీసీసీగా నియమామకం కావడంతో ఆపార్టీలో జోష్ నెలకొంది. ఈక్రమంలోనే హుజూరాబాద్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందని అంతా భావించారు. అయితే అభ్యర్థిని ప్రకటించేందుకే కాంగ్రెస్ నానా తంటాలు పడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నుంచి పలువురి ప్రముఖుల పేర్లు తెరపైకి వచ్చినా చివరి నిమిషంలో ఆ సీటు బల్మూరు వెంకట్ కు దక్కింది.
ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా బల్మూరి వెంకట్ రెండు పర్యాయాలుగా పని చేస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచి ఆపార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న తరుణంలోనే కాంగ్రెస్ బల్మూరి వెంకట్ పేరును తెరపైకి తీసుకొచ్చింది. దీంతో హుజూరాబాద్లో త్రిముఖ పోటీ ఉంటుందనే ప్రచారం జరిగింది. అయితే ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పరిస్థితి నెలకొంది. ఓవైపు బీజేపీ, టీఆర్ఎస్ ప్రచారం దూసుకెళుతుండగా కాంగ్రెస్ అభ్యర్థి మాత్రం ఎక్కడా కన్పించడం లేదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్కడ కానరావడం లేదు.
నేతలే కాదు కనీసం కార్యకర్తలు కూడా ప్రచారం జోలికి వెళ్లడం లేదని తెలుస్తోంది. ఓవైపు పోలింగ్ తేదికి సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్ ఇంకా ప్రచారం మొదలెట్టకపోవడానికి కారణం ఏంటనే సందేహాలు కలుగుతున్నాయి. దీనికితోడు స్థానిక నేతలను బల్మూరి వెంకట్ కలుపుకుపోవడం లేదనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇలా అయితే కాంగ్రెస్ ఎప్పుడు ప్రచారం మొదలుపెడుతుంది? ఇంకెప్పుడూ ప్రజలను ఆకట్టుకుంటుందని కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ దుస్థితి చూస్తుంటే పోటీకి ముందే సైడ్ అయినట్లు కన్పిస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.