ఒక మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు.. కాటేసేందుకు కామాంధులు కాచుకూర్చున్నారు. మహిళల్ని బలహీనులని భావించి, వారిని లోబరుచుకుంటే ఏం చేయలేరన్న మదంతో రెచ్చిపోతున్నారు. కానీ, తాము తలుచుకుంటే ఎలాంటి వారినైనా మట్టికరిపిస్తామని చెప్పడానికి తాజా ఉదంతం సాక్ష్యంగా నిలిచింది. తమపై అఘాయిత్యానికి పాల్పడేవారిని ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో ఓ మహిళ ఇతరులకు ఆదర్శంగా నిలిచింది. తనను రేప్ చేయడానికి వస్తే, ఏమాత్రం జంకకుండా తిరిగి అతనిపై దాడి చేసి, తగిన బుద్ధి చెప్పింది.
అది మధ్యప్రదేశ్.. ఓ మహిళ సాయంత్రం మార్కెట్‌కి వెళ్లి తిరిగొస్తుంది. ఆ దారిలో ఎవ్వరూ లేరు. మొత్తం నిర్మానుష్యంగా ఉంది. దీన్నే అదునుగా తీసుకొని, ఓ కామాంధుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న ఆమెను, లోబర్చుకోవాలని ప్రయత్నించాడు. కానీ, ఆమె ప్రతిఘటించింది. తన మీద కాటేసేందుకు వస్తున్నాడని భయపడకుండా, రివర్స్‌లో అతని మీద దాడి చేసింది. ‘‘నా మీదే చెయ్యేస్తావా?’’ అంటూ ఉగ్రరూపం దాల్చిన ఆ మహిళ, అతడ్ని చెప్పుతో అరగంట చితక్కొట్టింది. కింద పడినా, తనని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తోన్నా.. ఆమె కోపం మాత్రం చల్లారలేదు. ఎడాపెడా వాయిస్తూ.. అతనికి బడితపూజ చేసింది.
ఈ మొత్తం దృశ్యాన్ని అటుగా వెళ్తోన్న ఓ వ్యక్తి తన కెమెరాలో బంధించాడు. చివరికి నిందితుడు కాళ్లు పట్టుకొని తనని క్షమించమని వేడుకోవడంతో, ఆమె విడిచిపెట్టింది. మరోసారి అమ్మాయిల జోలికెళ్తే తాట తీస్తానంటూ అతనికి వార్నింగ్ ఇచ్చి వెళ్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కీచకుడికి తగిన బుద్ధి చెప్పావంటూ, ఆ మహిళ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు. మహిళలు ఇలా స్ట్రాంగ్‌గా తిరగబడితే, ఎవ్వరూ ఏం చేయలేరంటూ కామెంట్స్ చేస్తున్నారు.